Share News

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:57 PM

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!
India vs England 3rd T20

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం తర్వాత.. టీమిండియా ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేకపోతుంది. సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. అతడి నాయకత్వంలో భారత టీ20 జట్టు ఇంకా గెలుపు బాట పట్టలేదు. ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇంగ్లండ్‌తో రెండో టీ20లో రవి బిష్ణోయ్ అత్యంత పేలవంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా 17వ ఓవర్లో రెండు బ్యాక్‌ఫుట్ నో బాల్స్‌తో కలిపి 29 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌ ఆ ఒక్క ఓవర్ వల్లే ఓడిపోవాల్సి వచ్చిందంటూ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ మూడో టీ20లో అదనపు సీమర్‌తో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌ లేదా గుర్నూర్ బ్రార్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బంతిని గాల్లోనూ, పిచ్‌పై కూడా స్వింగ్ చేయగల సామర్థ్యం ఆ ఇద్దరికీ ఉండటం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ కంటే ప్రిన్స్ యాదవ్ మెరుగైన ఎంపికగా భావిస్తున్నారు. శ్రీలంక-ఎతో జరిగిన అనధికారిక రెండో టెస్టు మ్యాచ్‌లో బ్రార్ మొత్తం 10 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.


అర్ష్‌దీప్ కూడా..

రెండో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ హ్యారీ బ్రూక్ అతడి ఓవర్లో 27 పరుగులు రాబట్టడం ఇంగ్లండ్ విజయానికి కీలకంగా మారింది. ఇక భారత బ్యాటింగ్ విభాగం కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 189, 190 పరుగులు చేసినప్పటికీ అవి సరిపోలేదు. ఇంగ్లండ్ పేసర్లు అదనపు బౌన్స్, స్వింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పరుగులు చేసినా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చాటలేకపోయారు. తిలక్ వర్మ రెండో టీ20లో వేగంగా పరుగులు చేసినా, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వచ్చిన పేస్‌ను మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. అభిషేక్ శర్మ మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్ర ఒత్తిడిని దాటిన వైభవ్ సూర్యవంశీ కూడా ఈసారి ఇంగ్లండ్ బౌలర్లపై భారీ ఇన్నింగ్స్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్లు లియామ్ డాసన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ భారత బ్యాటర్లను కట్టడి చేస్తుండగా, వరుణ్ చక్రవర్తి మాత్రం తన సాధారణ శైలికి భిన్నంగా బౌలింగ్ చేస్తూ ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో జులై 7న జరగనున్న మూడో టీ20లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. జట్టులో మార్పులు ఎంత మేర ఫలిస్తాయో చూడాలి.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌: ట్రంప్ జోక్యం.. యూఎస్ ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేత!

వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు

Updated Date - Jul 06 , 2026 | 01:23 PM