Share News

చరిత్ర సృష్టించిన డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..

ABN , Publish Date - Jul 06 , 2026 | 02:52 PM

మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆల్‌రౌండర్ డాసున్ శనక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

చరిత్ర సృష్టించిన  డాసున్ శనక: 4 బంతుల్లో 4 వికెట్లు..
Dasun Shanaka

స్పోర్ట్స్ డెస్క్: మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2026) చరిత్రలో శ్రీలంక ఆల్‌రౌండర్ డాసున్ శనక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆదివారం టెక్సాస్ సూపర్‌ కింగ్స్‌ (TSK), సీటెల్ ఓర్కాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత ఓవర్లలో కేవలం 121 పరుగులకే పరిమితమైంది.


స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్‌ కింగ్స్ విజయం దిశగా సాగింది. ఆఖరి ఓవర్లో ఆ జట్టు గెలుపునకు 15 పరుగులు అవసరమవగా.. తొలి బంతికే శుభమ్ రంజనే ఫోర్ కొట్టడంతో సమీకరణం 4 బంతుల్లో 10 పరుగులుగా మారింది. క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు ఉండటంతో టెక్సాస్ విజయం ఖాయమనుకున్నారంతా. కానీ, సీటెల్ బౌలర్ డాసున్ శనక బంతితో మ్యాజిక్ చేశాడు. రెండో బంతికి ప్రమాదకరమైన డోనోవన్ ఫెరీరాను క్లీన్ బౌల్డ్ చేసిన శనక.. ఆ తర్వాతి బంతికి కాల్వీన్ సావేజ్‌ను పెవిలియన్ పంపాడు. నాలుగో బంతికి ఆడమ్ మిల్నేను కీపర్ క్యాచ్‌గా అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు.


ఇక ఆఖరి బంతికి అంషి డిసిల్వాను హెట్‌మైర్ చేతికి చిక్కేలా చేసి.. వరుసగా నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెక్సాస్ జట్టును 9 పరుగుల తేడాతో ఓడించి సీటెల్‌కు సంచలన విజయాన్ని అందించాడు డాసున్ శకన. అంతకుముందు సీటెల్ ఓర్కాస్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై ఒక దశలో 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే తొమ్మిదో స్థానంలో వచ్చిన కెమెరాన్ గానన్ (20 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్మీత్ సింగ్, జస్‌దీప్ చివర్లో రాణించడంతో జట్టు స్కోరు 121కి చేరింది. అనంతరం బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (3 వికెట్లు) టెక్సాస్ ఓపెనర్లు డుప్లెసిస్, సాయితేజలను ముందే అవుట్ చేసి ఒత్తిడి పెంచారు. శనక 4 వికెట్లు, బార్ట్‌మన్ 3 వికెట్లతో చెలరేగి సీటెల్‌కు అపురూప విజయాన్ని కట్టబెట్టారు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు తీవ్ర గాయం.. ఆస్పత్రికి తరలింపు

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

Updated Date - Jul 06 , 2026 | 03:02 PM