Share News

ఏపీలో స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగవంతం

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:59 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ బలం నిర్ణయించే విధానాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొంది.

ఏపీలో స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగవంతం
AP Government

అమరావతి, జులై 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నం.46ను ప్రభుత్వం ఈరోజు(సోమవారం) జారీ చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ బలం నిర్ణయించే విధానాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొంది. వర్కింగ్ స్ట్రెంగ్త్ పంపిణీకి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల వారీగా పోస్టుల కేటాయింపు జరగనుంది. సేవల అవసరం, పరిపాలనా అవసరాల ఆధారంలో పోస్టుల పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. శాఖల వారీగా పోస్ట్స్ అలొకేషన్ రేషియో(PAR) రూపొందించి, మండలాల వారీగా అందుబాటులో ఉన్న సేవల డేటాతో PAR నిర్ణయించాలని ఆదేశించింది.


అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ ప్రతిపాదనలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఆపై, ఆర్థిక శాఖ ఆమోదంతో తుది పోస్టుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. రాష్ట్ర సచివాలయం, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్(HOD) కార్యాలయాలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయశాఖ పోస్టులు, అలాగే పబ్లిక్ సెక్టార్ సంస్థల పోస్టులకు ఈ మార్గదర్శకాలు వర్తించవని స్పష్టం చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలికంగా పోస్టుల కేటాయింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త పోస్టుల సృష్టిపై నిషేధం విధించింది. పదోన్నతులు, బదిలీలు, కొత్త నియామకాలు, డిప్యుటేషన్లపై తాత్కాలిక ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మార్గదర్శకాల అమలుకు అన్ని శాఖలు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ జీవో అమలుతో రాష్ట్రంలో స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ వేగవంతం కానుంది.


ఇవి కూడా చదవండి...

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 02:11 PM