ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ ఔట్.. ముగిసిన రొనాల్డో ప్రయాణం
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:38 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌పై 1-0 తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌పై 1-0 తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండు దశాబ్దాలకు పైగా తన ఆటతో మంత్రముగ్ధులను చేసిన రొనాల్డో.. తన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు.
2006లో తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన రొనాల్డో.. ఈ టోర్నీ తన చివరిదని మ్యాచ్‌కు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టును మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు తీసుకెళ్లాలన్న అతని ఆశలు నెరవేరలేదు. రెండో అర్థం అదనపు సమయంలో స్పెయిన్ ప్రత్యామ్నాయ ఆటగాడు మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయాన్ని ఖాయం చేసింది. ఈ విజయంతో స్పెయిన్ 2010లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తదుపరి దశలో అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది.
స్పెయిన్ చారిత్రక రికార్డు
ఈ మ్యాచ్‌తో స్పెయిన్ వరుసగా ఆరు ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇటలీ (1990), స్విట్జర్లాండ్ (2006-10) పేరిట ఉన్న ఐదు వరుస క్లీన్ షీట్‌ల రికార్డును అధిగమించింది. గోల్ కీపర్ ఉనై సిమోన్ వ్యక్తిగతంగానూ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 609 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా నిలిచి ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డు చెరిగిపోయింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు