Share News

నెమార్‌ షో ముగిసె..

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:57 AM

గరించా, పీలే, జికో, రొమారియో, రివాల్డో, రొనాల్డిన్హో వారసుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌కు వెన్నెముకగా నిలిచిన నెమార్‌ జూనియర్‌ తన ఆటను ముగించాడు.

నెమార్‌ షో ముగిసె..

అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు

నెమార్‌ను ఓదారుస్తున్న సహచరుడు

జట్టు గుండె చప్పుడు

గరించా, పీలే, జికో, రొమారియో, రివాల్డో, రొనాల్డిన్హో వారసుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌కు వెన్నెముకగా నిలిచిన నెమార్‌ జూనియర్‌ తన ఆటను ముగించాడు. ప్రీక్వార్టర్స్‌లో నార్వే చేతిలో పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన 34 ఏళ్ల నెమార్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎక్కడైతే అరంగేట్రం చేశాడో.. అక్కడే అంతులేని ఆవేదనతో కెరీర్‌ను ముగిస్తున్నట్టు వెల్లడించి అభిమానులను మరింత షాక్‌కు గురి చేశాడు.

ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ తరఫున నెమార్‌ ఆడింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. గాయం కారణంగా అతను నార్వేతో మ్యాచ్‌ ముందు వరకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. నార్వేతో పోరులో కూడా ద్వితీయార్ధంలో బరిలోకి దిగి జట్టు సాధించిన ఏకైక గోల్‌ను పెనాల్టీ కిక్‌తో తానే అందించాడు. ఆ వెంటనే నార్వే గోల్‌ కీపర్‌ దగ్గరికి వెళ్లి ‘గుర్తుంచుకో.. నా పేరు నెమార్‌’ అంటూ గర్వంగా చెప్పడం కనిపించింది. అనంతరం అదే తన చివరి గోల్‌ అనే ఉద్దేశంతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ప్రేక్షకులకులకు అభివాదం చేశాడు. 2010లో 18 ఏళ్ల వయస్సులో ఇదే మెట్‌లైఫ్‌ మైదానంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో నెమార్‌ అరంగేట్రం చేశాడు. ‘ఎంతో ప్రయత్నించా. కానీ ఇప్పుడు అంతా ముగిసి పోయింది. ఇక్కడే నా ప్రయాణం ఆరంభమైంది. ఇక్కడే ముగిసింది’ అంటూ నెమార్‌ తన ఆటకు వీడ్కోలు పలికాడు.

ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అత్యంత పటిష్టమైన జట్టుగా పేరు తెచ్చుకున్న బ్రెజిల్‌ ఆరో వరల్డ్‌కప్‌ కోసం తాజా టోర్నీలో బరిలోకి దిగింది. కానీ ఆరంభం నుంచి నెమార్‌ జట్టులో లేకపోవడంతో బలహీనంగా కనిపించింది. ఇక నార్వే సంచలన ప్రదర్శన ఆ జట్టు ఆశలను ఆవిరి చేసింది. నిజానికి నెమార్‌ కెరీర్‌లో గాయాలదే సింహభాగంగా చెప్పవచ్చు. ఇదే కారణంగా చాలాకాలం పాటు అతను జట్టుకు దూరమైనా వరల్డ్‌కప్‌ గెలవాలనే కసితో తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. కానీ తన చివరి టోర్నీలో జట్టును విజేతగా నిలపాలనే కల చెదరడంతో మరింత ఆవేదన చెందాడు. జూనియర్‌ స్థాయిలోనే మెరుపులు మెరిపించిన నెమార్‌ వడివడిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2010లో సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు.


సాకర్‌ను ఆట కంటే ఓ కళగా భావించిన అతను.. అనతికాలంలోనే తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మేటి ఫార్వర్డ్‌ ఆటగాడిగా మన్ననలందుకున్నాడు. మైదానంలో పాదరసంలా కదలాడుతూ, వ్యూహ్మాతకంగా ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన ఆటతో తమ దేశ దిగ్గజాలు పీలే, రొనాల్డిన్హోలను మరిపించి బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌కు గుండె చప్పుడయ్యాడు. మొత్తంగా 130 మ్యాచ్‌లాడి తమ జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ (80) చేసిన ఆటగాడిగా పీలేను సైతం దాటేసి చరిత్రలో నిలిచాడు. కెరీర్‌లో నెమార్‌ నాలుగు ప్రపంచక్‌పల్లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతీసారి ఆశాకిరణంగా బరిలోకి దిగినా జట్టును మాత్రం విజేతగా నిలపలేకపోయాడు. అయితే 2016లో సొంతగడ్డపై జరిగిన రియో ఒలింపిక్స్‌లో మాత్రం బ్రెజిల్‌కు స్వర్ణ పతకం అందించగలిగాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 05:57 AM