ఫిఫా ప్రపంచ కప్: ఫలించని ట్రంప్ జోక్యం.. టోర్నీ నుంచి అమెరికా ఔట్
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:40 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆతిథ్య దేశం అమెరికాకు బెల్జియం జట్టు భారీ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 4-1 తేడాతో బెల్జియం ఘన విజయం సాధించింది. దీంతో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెల్జియం జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆతిథ్య దేశం అమెరికాకు బెల్జియం జట్టు భారీ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 4-1 తేడాతో బెల్జియం ఘన విజయం సాధించింది. దీంతో అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. బెల్జియం జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు అమెరికా స్టార్ ప్లేయర్ ఫోలారిన్ బలోగన్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎత్తివేయడం తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఫిఫా ఆ నిర్ణయం తీసుకుందనే వార్తలు ఫుట్‌బాల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే బలోగన్ బరిలోకి దిగినా మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచే బెల్జియం దూకుడుగా ఆడింది. తొమ్మిదో నిమిషంలో చార్లెస్ డి కెటెలారే గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. 31వ నిమిషంలో మాలిక్ టిల్‌మన్ ఫ్రీకిక్‌తో అమెరికా సమం చేసినా.. ఆ ఆనందం రెండే నిమిషాలు నిలిచింది. 33వ నిమిషంలో డి కెటెలారే మరోసారి హెడ్డర్‌తో గోల్ చేసి బెల్జియాన్ని మళ్లీ ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. రెండో భాగంలో అమెరికా గోల్ కీపర్ మ్యాట్ ఫ్రీస్ చేసిన ఘోర తప్పిదాన్ని హాన్స్ వానాకెన్ సద్వినియోగం చేసుకుని 57వ నిమిషంలో మూడో గోల్ నమోదు చేశాడు. అదనపు సమయంలో సీనియర్ ప్లేయర్ రొమేలు లుకాకు మరో గోల్ చేయడంతో బెల్జియం 4-1తో ఘన విజయాన్ని ఖాయం చేసింది.
బలోగన్ ఆడేందుకు అనుమతి ఇవ్వడాన్ని బెల్జియం ఫుట్‌బాల్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫిఫాకు అప్పీల్ చేసింది. కానీ దాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ మైదానంలో బెల్జియం పూర్తి ఆధిపత్యం చెలాయించి అమెరికా ఆశలకు తెరదించింది. ఈ విజయంతో బెల్జియం క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా.. తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. మరోవైపు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అమెరికా అభిమానులకు నిరాశే మిగిలింది.
ఇవి కూడా చదవండి:
నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు: రొనాల్డో
ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ ఔట్.. ముగిసిన రొనాల్డో ప్రయాణం