10 నిమిషాల్లో 66 హాట్ డాగ్స్ తిన్నాడు.. రూ. 9 లక్షలు గెలిచాడు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 10:09 AM
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్‌లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇండియన్స్‌కు హాట్ డాగ్స్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బ్రెడ్, మాంసంతో తయారు చేసే వీటిని అమెరికాలో చాలా ఎక్కువగా తింటారు. న్యూయార్క్ నగరం, బ్రూక్లిన్ ప్రాంతంలోని కోని ఐలాండ్‌లో ప్రతీ ఏటా నాథాన్స్ హాట్ డాగ్ ఈటింగ్ కంటెస్ట్ జరుగుతుంది. 10 నిమిషాల్లో ఎన్ని ఎక్కువ హాట్ డాగ్స్ తింటే.. వారే ఈ పోటీలో విజేతగా నిలుస్తారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈటింగ్ కంటెస్ట్‌లో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. 10 నిమిషాల్లో ఏకంగా 66 హాట్ డాగ్స్ తిన్నాడు.
పురుషుల క్యాటగిరీలో జోయ్ చెస్ట్‌నట్ అనే వ్యక్తి 18వ సారి విజేతగా నిలిచి రికార్డు సృష్టించాడు. అయితే, తన పాత రికార్డును అతడు అధిగమించలేకపోయాడు. 2021లో అతడు ఏకంగా 76 హాట్ డాగ్స్ తిన్నాడు. ఈ సారి అన్ని తినలేకపోయాడు. ఇక, మహిళల క్యాటగిరీలో మికీ సూడో అనే మహిళ 10 నిమిషాల్లో 38.75 హాట్ డాగ్స్ తిని విజేతగా నిలిచింది. పురుషుల క్యాటగిరీలో విజేతగా నిలిచిన చెస్ట్‌నట్‌కు ప్రైజ్ మనీ కింద 10 వేల డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో 9.5 లక్షల రూపాయలు) వచ్చాయి.
చెస్ట్‌నట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జూలై 4వ తేదీన కోని ఐలాండ్‌లో పోటీ పడటం ఒక కల లాంటిది. ఇక్కడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. భూమిపై దీనికంటే అద్భుతమైన ప్రదేశం మరొకటి లేదు. 90 డిగ్రీల ఫారెన్‌హీట్ ఎండ కారణంగా బాగా అలసిపోయాను. ఎండవల్ల సాధారణంగా తినే వేగం తగ్గింది. వాతావరణం నా ఆటను పాడుచేయకూడదని అనుకున్నాను. నేను మరింత వేగంగా తినాలని ఒత్తిడి తెచ్చుకుంటే.. ఆహారం నా గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకే చాలా ప్రశాంతంగా తిన్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. హ్యుందాయ్ మోబిస్, అపాక్ట్ సీఈవోతో భేటీ
తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి