కౌంటర్లు క్లోజ్.. మెట్రోలో డిజిటల్ టికెట్లే..
ABN , Publish Date - Jul 07 , 2026 | 08:40 AM
ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన మెట్రోరైలు రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది.
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
వృద్ధులు, మహిళలకు కొత్త సమస్యలు
హైదరాబాద్ సిటీ: ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన మెట్రోరైలు రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. అయితే టికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు మూసివేసి, టికెట్ వెండింగ్ మెషీన్లు (టీవీఎంలు) ద్వారానే తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కీలకమైన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడు కౌంటర్ మూసి ఉండటంతో అక్కడి సిబ్బందిని సంప్రదించగా, పక్కనే ఉన్న డిజిటల్ యంత్రంలో తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ యంత్రం వినియోగంపై అవగాహన లేకపోవడంతో ప్రయాణి కుడు కొంతసేపు అక్కడే ఇబ్బంది పడ్డారు.
అవగాహన లేకపోతే..
నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ టికెట్ జారీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అందరికీ అవగాహన ఉండదని ప్రయాణికులు వాదిస్తున్నారు. వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు, స్మార్ట్‌ఫోన్ లేదా డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేని వారు టికెట్ కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కౌంటర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్‌పేట్, మియాపూర్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, రాయదుర్గం వంటి రద్దీ స్టేషన్లలో కౌంటర్లు కొనసాగించడం అవసరమని సూచిస్తున్నారు.
డిజిటలైజేషన్ అవసరమే కానీ..
ప్రజా రవాణా వ్యవస్థలో డిజిటలైజేషన్ అవసరమే అయినప్పటికీ, ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా అమలు చేయాలని పట్టణ రవాణా నిపుణులు సూచిస్తున్నారు. మానవ సహాయం అందుబాటులో ఉండే హైబ్రిడ్ మోడల్ ఉత్తమ పరిష్కారమని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను రాకముందు పోర్చుగల్‌కు ఒక్క టైటిల్ కూడా లేదు
తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News