‘మద్దతు’కు మించి.. పెరుగుతున్న ధాన్యం, మక్కల ధరలు
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:51 PM
రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాకు రూ.2,689.. మక్కజొన్నలు రూ.2,024
పది రోజులలో సగటున రూ.250 పెరుగుదల
ఎల్‌నినో ప్రభావంతో మరింత హైక్
కేసముద్రం(మహబుబాబాబాద్): రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి. శుక్రవారం మార్కెట్‌కు ఆర్‌ఎన్‌ఆర్ ర కం ధాన్యం 26 మంది రైతులు 1,030 బస్తాల్లో విక్రయించేందుకు తీసుకువచ్చారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో ధాన్యం గరిష్ఠంగా రూ.2,689, కనిష్ఠంగా రూ.2,209, సగటున రూ.2,636 ధరల చొప్పున వ్యాపారులు ఖరీదులు చేశారు.
వరుసగా తొమ్మిది రోజులు వేసవి సెలవులకు ముందు గతనెల 22న ఇదే రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.2,451, కనిష్ఠంగా రూ.2,009, సగటున రూ.2,339 ధరల చొప్పున ఖరీదులు కొనసాగాయి. ఈ నెల 1న గరిష్ఠంగా రూ.2,572, కనిష్టంగా రూ.2,139, సగటున రూ.2,495 ధరల చొప్పన వ్యాపారులు ఖరీదులు చేశారు. పది రోజుల క్రితం మార్కెట్‌తో పోలిస్తే తాజా ధరల్లో సగటున క్వింటాకు రూ.2,97ల పెరుగుదల ఉంది. ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389 ఉండగా అంతకు మించి రూ.300లు అధికంగా ధరలు నమోదు కావడం విశేషం.
మక్కల ధర కూడా..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 19 మంది రైతులు 1,054 బస్తాల్లో మక్క లు తీసుకురాగా, ఈ-నామ్‌లోని ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,024, కనిష్ఠంగా రూ.1,851, సగటున రూ.2,012 ధరలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇదే మార్కెట్లో సెలవులకు ముందు గతనెల 22న మక్కలు క్వింటాకు గరిష్ఠంగా రూ.1,976, కనిష్ఠంగా రూ.1,912, సగటున రూ.1,949 ధరలు నమోదయ్యాయి. ఈ నెల 1న క్వింటాకు గరిష్ఠంగా రూ.2,036, కనిష్ఠంగా రూ.1,855, సగటున రూ.1,991 ధరలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. మక్కల సగటు ధరల్లో క్వింటాకు రూ.63లు పెరిగాయి. మక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ఉండడంతో చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ఎకరాకు 26 క్వింటాళ్లే ప్రభుత్వానికి విక్రయించే అవకాశం ఉండడంతో మిగిలిన సరుకు, ఆలస్యంగా సాగు చేసిన పలువురు రైతులు మార్కెట్లో తమ మక్కలు విక్రయించేందుకు తీసుకువస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం...
ఇక్కడి మార్కెట్ నుంచి బాయిల్డ్, ముడి ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఈ వర్షకాలంలో వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారంతో వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు. ధాన్యం, మక్కజొన్నలను స్టాక్ పెడుతుండడం, రాబోయే రోజుల్లో సరుకు లభ్యత ఉండదనే అంచనాలతో ధరలు పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాకు ధర రూ.2,700 వరకు వెళ్లే అవకాశాలున్నట్లు పలువురు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పెరుగుతున్న ధరలను పలువురు రైతులు తమ పంట ఉత్పత్తులను గరిష్ఠ ధర వద్ద విక్రయించేందుకు మార్కెట్‌రేట్లను నిశితంగా పరిశీలిస్తూ వేచి ఉండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది?
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తప్పిన పెను ప్రమాదం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News