Share News

విమానంలో రుసుం వివాదం.. పోలీస్ సిబ్బందిని కరిచిన మహిళ

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:41 PM

అర్జెంటీనాలో ఓ విమానంలో అధిక బ్యాగేజీకి సంబంధించిన రుసుం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల కళ్లుగప్పి అధిక బ్యాగేజీతో విమానంలోకి ప్రవేశించిన ఆమె పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది.

విమానంలో రుసుం వివాదం.. పోలీస్ సిబ్బందిని కరిచిన మహిళ

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనాలో ఓ విమానంలో అధిక బ్యాగేజీకి సంబంధించిన రుసుం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మహిళ అదనపు బ్యాగేజీ సొమ్ము చెల్లించేందుకు నిరాకరించడంతో ఈ వివాదం తలెత్తింది. అధికారుల కళ్లుగప్పి అధిక బ్యాగేజీతో విమానంలోకి ప్రవేశించిన ఆమె.. కాసేపు రచ్చ చేసింది. అధికారులు జోక్యం చేసుకుని ఆమెను అడ్డుకోగా.. ఆగ్రహంతో ఓ పోలీస్ సిబ్బందిని కరిచింది. ఈ ఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని జోర్జ్ న్యూబెరీ ఎయిర్‌పార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.


బ్యూనస్ ఎయిర్స్ నుంచి కోర్డోబాకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానం ఎక్కేందుకు పరిమితికి మించిన బ్యాగేజీతో ఓ మహిళ వచ్చింది. గమనించిన విమానయాన సిబ్బంది ఫైన్ విధించారు. దీనికి ఆమె నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. ఆమె బలవంతంగా విమానం ఎక్కేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను దింపేందుకు యత్నించారు. పరిస్థితులు తోపులాటకు దారితీశాయి. దురుసుగా ప్రవర్తించిన ఆ మహిళ.. ఓ పోలీస్ సిబ్బందిని కరిచింది.

ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నిమిత్తం బయటకు దింపారు. ఈ ఘటనతో ఆ విమానం కాస్త ఆలస్యంగా టేకాఫ్ అయింది.


ఇవీ చదవండి:

ధోని సరసన రిషబ్ పంత్.. టెస్టుల్లో అరుదైన ఘనత

వీడ్కోలు సంస్కృతికి గుడ్‌బై.. భారత క్రికెట్‌లో కొత్త యుగం!

Updated Date - Jun 06 , 2026 | 12:43 PM