వీడ్కోలు సంస్కృతికి గుడ్‌బై.. భారత క్రికెట్‌లో కొత్త యుగం!
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:29 AM
టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసియా కప్ గెలిపించాడు.. టీ20 ప్రపంచ కప్‌ను నిలబెట్టాడు.. భారత టీ20 చరిత్రలో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకు ప్రత్యేక వీడ్కోలు సిరీస్ లభించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు భారత క్రికెట్‌లో స్టార్ ప్లేయర్లకు ప్రత్యేక గౌరవం ఉండేది. వారి కెరీర్ ఎప్పుడు ముగియాలి.. ఎలా ముగియాలి.. అనే అంశాలు ప్లేయర్లే స్వయంగా నిర్ణయించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసియా కప్ గెలిపించాడు.. టీ20 ప్రపంచ కప్‌ను నిలబెట్టాడు.. భారత టీ20 చరిత్రలో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేక వీడ్కోలు సిరీస్ లభించలేదు. గత రెండేళ్లుగా అతడి బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా మారడంతో సెలక్టర్లు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ వచ్చాకే..
భారత క్రికెట్‌లో ఇలాంటి నిర్ణయాలు గతంలో అరుదుగా కనిపించేవి. స్టార్ బ్యాటర్ సునీల్ గావస్కర్ తన రిటైర్‌మెంట్ సమయాన్ని తానే నిర్ణయించుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు 200వ టెస్టు మ్యాచ్ వరకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించారు. ఎంఎస్ ధోని ఏడాదికి పైగా ఎలాంటి ప్రకటన లేకుండా కొనసాగి.. తనకు నచ్చిన సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్టార్ ప్లేయర్లకు వ్యవస్థ కూడా అనుకూలంగా ఉండేది. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్డర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతా మారిపోయింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ వారు ఫామ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అనూహ్యంగా వారు టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఫామ్‌కే ప్రాధాన్యం..
సూర్యకుమార్ విషయంలోనూ అదే విధానం కొనసాగుతోంది. గత ఏడాది టీ20ల్లో అతడి సగటు 13.62కే పరిమితమైంది. ఐపీఎల్ 2026లో కూడా 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులే చేశాడు. కెప్టెన్‌గా 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు అందించినా.. బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సెలక్టర్లు భవిష్యత్తు కెప్టెన్ ఎంపికపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. అలాగే రజత్ పాటీదార్ వంటి యువ కెప్టెన్లు కూడా టీమిండియాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో టీ20 జట్టును బలంగా తయారుచేయడంపైనే టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
గిల్‌ను కూడా తప్పించారు..
ఈ మార్పు కేవలం సూర్యకుమార్‌కే పరిమితం కాలేదు. ఒకప్పుడు భవిష్యత్తు సూపర్ స్టార్‌గా భావించిన ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కూడా టీ20 ఫార్మాట్‌లో ఫామ్ లేకపోవడంతో తప్పించేందుకు వెనుకాడలేదు. జట్టుకు అవసరమైతే ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయినా ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత క్రికెట్‌లో ‘సూపర్ స్టార్ కల్చర్’కు ముగింపు పలుకుతున్న సంకేతాలు ఇవేనా? లేక ఇది తాత్కాలిక దశ మాత్రమేనా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా ప్రదర్శన పేలవంగా మారితే.. జట్టులో స్థానం కోల్పోతారు. అవకాశాలు దొరక్కపోతాయా.. అన్న భావనలో ఉంటే జట్టులో మనుగడ సాధ్యం కాదు. ఇదే ఇప్పుడు భారత క్రికెట్‌లో ప్రారంభమైన కొత్త అధ్యాయంగా చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!
మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!