Share News

అఫ్గాన్‌ టెస్టుతో భారత ఆల్‌రౌండర్ అరంగేట్రం.. ఎవరీ మానవ్ సుతార్?

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:42 AM

ముల్లాన్‌పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. సుతార్‌కు టెస్టు క్యాప్ అందజేశాడు.

అఫ్గాన్‌ టెస్టుతో భారత ఆల్‌రౌండర్ అరంగేట్రం.. ఎవరీ మానవ్ సుతార్?
Manav Suthar

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న సుతార్.. భారత్ తరఫున టెస్టు క్రికెట్ క్యాప్ అందుకున్న 319వ ఆటగాడిగా నిలిచాడు. మరో యువ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబె కూడా డెబ్యూకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడితో పోటీని అధిగమించి సుతార్ తుది జట్టులో చోటు సంపాదించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. సుతార్‌కు టెస్టు క్యాప్ అందజేశాడు.


రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల ఎడమచేతి స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ సుతార్.. 2022 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 129 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో సుతార్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాట్‌తో సెంచరీ(120) చేయడమే కాకుండా బంతితో మొత్తం ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


బ్యాటింగ్‌లోనూ తనదైన ముద్ర వేసిన సుతార్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 945 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 25 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 28 టీ20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలంగా భారత సెలక్టర్ల దృష్టిలో ఉన్న సుతార్.. 2023 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన భారత జట్టు ప్రిపరేటరీ క్యాంప్‌కు కూడా పిలుపు అందుకున్నాడు. అప్పటి నుంచి అతడి ప్రదర్శనను నిశితంగా గమనిస్తున్న సెలెక్టర్లు.. చివరకు అఫ్గానిస్థాన్ టెస్టులో అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సుతార్.. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అదే జట్టులో ఉన్న భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్న ఈ యువ ఆల్‌రౌండర్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు.


మ్యాచ్ విషయానికొస్తే..

అఫ్గానిస్థాన్‌పై భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ వార్త రాసే సమయానికి 12 ఓవర్లు ఆడిన టీమిండియా.. ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో కేఎల్ రాహుల్(16*), సాయి సుదర్శన్(0*) ఉన్నాడు. అఫ్గాన్ బౌలర్ సలీమ్ సాఫీ యశస్వి వికెట్ పడగొట్టాడు.


ఇవి కూడా చదవండి:

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

Updated Date - Jun 06 , 2026 | 10:48 AM