పంజాబ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 8మంది మృతి..
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:28 PM
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
చండీగఢ్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఇటీవల మృతిచెందిన తమ బంధువు అస్థికలను నీటిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి గురైన వారిని జలాలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
బాధితులు తమ బంధువు అస్థికలను తీసుకుని బియాస్‌లోని రాధా సోమీ డేరాకు శనివారం ఉదయం ప్రయాణం మెుదలుపెట్టారు. సుమారు 25 మంది మహీంద్రా పికప్ వాహనంలో బయలుదేరారు. అయితే, వాహనం జంగవాలా గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన మరో ట్రక్కును ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఫిరోజ్‌పూర్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువుల మృతితో ప్రమాద స్థలం, ఆస్పత్రి ప్రాంగణంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అభిజీత్ దీప్కే.. వీడియో వైరల్..
జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. లాలూ ఇంటి ముందు కార్యకర్తల కాపలా..