మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు..
ABN , Publish Date - Aug 14 , 2026 | 10:44 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.
16న పరిశీలించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఇక్కడి నుంచే మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం
తాడ్వాయి(ములుగు): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతు న్న అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఈ క్షేత్రాన్ని, పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న మేడారంలో పర్యటించనున్నారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అదేవిధంగా తుది దశకు చేరుకున్న నిర్మాణాలు పరిశీలించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మేడారంలో మంత్రి సీతక్క గురువారం పర్యటించారు. కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్స ల్ టొప్పోతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంత రం వనదేవతల ప్రాంగణం వద్ద విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రూ.294 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు,
ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా రాబోయే తరాలకు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. క్షేత్ర పవిత్రత దెబ్బతినకుండా భక్తుల సౌకర్యమే పరమావధిగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగం గా పూర్తి చేసిందన్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మేడారాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేడారంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
వనదేవతలను సీఎం దర్శించుకున్న అనంతరం తల్లుల సన్నిధి నుంచి అర్హులైన ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్‌జీ, సంపత్‌రావు, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కల్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, ములుగు డీఎస్పీ రవీందర్, దేవస్థానం ఈవో వీరస్వామి, స్థానిక సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్, కాంట్రాక్టర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్ రైళ్లు
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News