Share News

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:57 AM

అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్‌వర్క్‌లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది.

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్
Shadow Trans-Shipment Network To Evade US Tariffs

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్‌వర్క్‌లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది. ఇందులో భారత్‌ కూడా భాగమేనని మండిపడింది. ఈ దేశాలపై నిత్యం కన్నేసి ఉంచేందుకు వాచ్‌ లిస్ట్‌లో చేరుస్తున్నామని పేర్కొంది. ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్ పేరిట విడుదల చేసిన నివేదికలో అమెరికా వాణిజ్య విభాగం సలహాదారు పీటర్ నెవారో ఈ ఆరోపణలు చేశారు. ఇలాంటి సరకు రవాణాపై కన్నేసి ఉంచేందుకు తాము ఏఐని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.


2018లో ట్రంప్ సర్కారు సెక్షన్ 301 ప్రకారం చైనాపై సుంకాలు విధించిన అనంతరం ఈ అక్రమ వాణిజ్య విధానాలు పెరిగాయని నెవారో చెప్పారు. ఈ నెట్‌వర్క్ ద్వారా ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకూ విలువైన సరకు రవాణా జరుగుతోందని అన్నారు. ఈ నెట్‌వర్క్ స్కామ్‌తో చైనా 40 దేశాల ద్వారా సుంకాలను తప్పించుకుంటూ తన ఎగుమతులను అమెరికాకు చేరుస్తోందని అన్నారు. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న మెక్సికో, కెనడా, ఐరోపా సమాఖ్య, భారత్, జపాన్, దక్షిణ కొరియా ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయని ఆరోపించారు.

ప్రాసెసింగ్, రీలేబ్లింగ్, రీప్యాకేజింగ్, రీఇన్‌వాయిసింగ్, రౌటింగ్ మార్పుల వంటివాటికి ఈ దేశాలను వినియోగిస్తూ ఉత్పత్తులు మరో దేశం నుంచి వస్తున్నాయన్న భావన చైనా కలిగించిందని చెప్పారు. రకరకాల మార్గాల్లో చైనా నుంచి అమెరికా చేరుతున్న ఉత్పత్తులను గుర్తించేందుకు ఇకపై ఏఐను వినియోగిస్తామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

ఏఐతో ఉద్యోగాలు తగ్గిపోవు.. మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated Date - Aug 14 , 2026 | 10:18 AM