Share News

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:30 AM

కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీ‌ష్‏రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

  • బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీ‌ష్‏రావు

హసన్‌పర్తి(హనుమకొండ): కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీ‌ష్‏రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట దేవాదుల పంప్‌హౌస్‌ పనులను మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రాలో సీఎం చంద్రబాబునాయుడికి శిష్యుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి నీళ్లు వదిలేందుకే దేవాదుల మోటార్లు బంద్‌ పెట్టారా.. అని ఎద్దేవా చేశారు.


గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా ఎందుకు దేవాదుల లిఫ్ట్‌ వాడడం లేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్‌ రైతులను మోసం చేసిందన్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 16వేల క్యూసెక్కులు వెళ్తున్నా దేవన్నపేట పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు పనిచేయడం లేదని మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‏రెడ్డి 2025 మార్చి 18న మంత్రులతో హడావిడిగా పంప్‌హౌస్‌ మోటార్లు ప్రారంభించి ఇప్పటి వరకు రైతులకు సాగునీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దేవన్నపేట పంప్‌హౌస్‌ మోటార్లు ఆన్‌ చేయకపోవడం వల్ల 60వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి లిఫ్టింగ్‌ ఆగిపోవడం వల్ల జనగామ, పాలకుర్తి,స్టేషన్‌ఘన్‌పూర్‌, గండిరామారం లిఫ్టింగ్‌ ఆగిపోయిందన్నారు.


hareesh1.jpgరామప్ప నుంచి ఉనికిచర్ల వరకు 49.05 కిలోమీటర్ల టన్నెల్‌ ప్రపంచంలో లోతైన అతిపెద్ద టన్నెల్‌ను పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని హరీష్‏రావు అన్నారు. కేసీఆర్‌ సమ్మక్క బ్యారేజీ కట్టి 365 రోజులు నీళ్లు తీసుకునేవిధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు కేటాయింపులు ఉంటే కేసీఆర్‌ 60 టీఎంసీలకు పెంచి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేసారన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47వేల ఎకరాలు ఉంటే బీఆర్‌ఎస్‌ ఆ ఆయకట్టును 3.17 లక్షల ఎకరాలకు పెంచిందన్నారు.


గత ఏడాది భీంఘన్‌పూర్‌ వద్ద మోటార్లు ఆన్‌ చేయలేదన్నారు. మే 2024న మంత్రులు జిల్లాకు వచ్చి 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తామన్నారని, ఇప్పుడు ఫిబ్రవరి 2026 వచ్చినా పది పైసల పూనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా వదులుతున్నారని సెటైర్లు విసిరారు. మేడిగడ్డ నీళ్లు ఎత్తడం లేదని, దేవాదుల వద్ద పంప్‌హౌస్‌ మోటార్లు పని చేయడం లేదని, సీతమ్మ సాగర్‌ పూర్తి కాకుండా అక్కడే వదిలేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని విమర్శించారు.


హరీష్‏రావుకు ఘన స్వాగతం

దేవన్నపేట దేవాదుల పంప్‌హౌస్‏ను సందర్శించేందుకు వచ్చిన హరీష్‏రావుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పూలమొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, దాస్యం వినయభాస్కర్‌, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్‌ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మర్రి యాదవరెడ్డి, ఏనుగుల రాకేష్‏రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

బాలికల విద్యకు కేంద్రం భరోసా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 11:30 AM