మొబైల్ షాప్‌లో చెలరేగిన మంటలు.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది
ABN , Publish Date - Feb 21 , 2026 | 09:45 AM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మొబైల్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఈరోజు (శనివారం) అగ్నిప్రమాదం సంభవించింది. పద్మావతి ప్లాజా సెంటర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. గ్రౌడ్‌ఫ్లోర్‌లోని శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ షాప్‌లో మంటలు వ్యాపించాయి. షాపులోని ఫోన్‌లు, ఇతర సామాగ్రి అంతా కూడా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సుమారు అరగంట పాటు శ్రమించిన తర్వాత మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కొంత ఆందోళన కలిగింది. మంటలు పక్కనే ఉన్న షాపులకు వ్యాపించే అవకాశం ఉండటంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం సంభవించి ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News