వైసీపీ మహాపచారం
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:36 AM
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసనమండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారు.
చెప్పులు, బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్ల ప్రదర్శన
అసెంబ్లీ ప్రాంగణంలోనే కాదు.. మండలిలోనూ ఇదే తీరు
వాయిదా పడ్డాక పోస్టర్లు, ప్లకార్డులను లోపలే పడేసిన వైనం
శ్రీవారి ఫొటోలు సభలోకి తేవడంపై అధికార కూటమి ఆగ్రహం
వారికి దేవుడంటే భయం, నమ్మకం లేవు
విచక్షణ లేకుండా వాళ్ల నాయకుడు చెప్పినట్లు నడుచుకుంటున్నారు
మంత్రి పయ్యావుల మండిపాటు
చైర్మన్ వద్ద కూటమి నేతల నిరసన
స్వామి ఫొటోలు తేవడం తప్పేనన్న చైర్మన్
బొత్సను పిలిపించి వివరణ కోరిన మోషేన్
క్షమాపణ చెప్పేందుకు విపక్ష నేత ససేమిరా
మా సభ్యులు చెప్పులు వేసుకున్నారనడానికి ఆధారం చూపించండి.. బొత్స సవాల్
తక్షణమే వీడియోలను షేర్ చేసిన లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు.. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసనమండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారు. చెప్పులు, బూట్లు ధరించి.. శ్రీవారి పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ సభ్యులు శుక్రవారం నల్ల కండువాలు, నల్లబాడ్జీలు ధరించి.. అసెంబ్లీ నాలుగో గేటు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు చెప్పులు, బూట్లు వేసుకునే.. శ్రీవారి పోస్టర్లు పట్టుకుని ‘గోవిందా గోవిందా’.. ‘చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి’ అంటూ నినాదాలు చేశారు. బ్యాడ్జీలు, పోస్టర్లు, బ్యానర్లతో అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతి లేదంటూ మార్షల్స్ అడ్డు చెప్పారు. అయినా వారు వినకుండా ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో.. గేటు మూసి వారి చేతుల్లోని స్వామి పోస్టర్లు, ప్లకార్డులను, బ్యానర్లను మార్షల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 10.07 గంటలకు మండలి సమావేశం మొదలవగా.. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి.. ఇందాపూర్-హెరిటేజ్ సంస్థపై వైసీపీ సభ్యులు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
అయితే వైసీపీ సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, హనుమంతరావు, రవిబాబు, వరుదు కల్యాణి, కల్పలత, రమేశ్ యాదవ్, విక్రాంత్ తదితరులు ఇందాపూర్ డెయిరీపై చర్చకు అనుమతించాలంటూ స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. బూట్లు, చెప్పులతో స్వామి ఫొటోలు ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్, అధికార కూటమి సభ్యులు మండిపడ్డారు. ‘వైసీపీ నేతలకు బుద్ధుందా? రాజకీయం కోసం దేవుడి ఫొటోలను సభలో ప్రదర్శించి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారా? దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్య. వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు.. నమ్మకమూ లేదు. విచక్షణ లేకుండా వారి నాయకుడు చెప్పినట్లు నడచుకుంటున్నారు. హిందువుల గౌరవం, జాతి నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని అంటూ కేశవ్ తన హెడ్ ఫోన్‌ను విసిరికొట్టారు. మంత్రి లోకేశ్, కూటమి ఎమ్మెల్సీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. వైసీపీ ఎమ్మెల్సీలు పెద్దగా నినాదాలు చేయడంతో.. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా పోడియం వద్దకు వెళ్లి, వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.11 సమయంలో 5 నిమిషాలు సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్లకార్డులతో పాటు స్వామి పోస్టర్లను వైసీపీ సభ్యులు అక్కడే పడేశారు.
చైర్మన్ వద్ద కూటమి నిరసన
అనంతరం మంత్రులు లోకేశ్, కేశవ్ సహా కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ చాంబర్‌కు వెళ్లారు. వేంకటేశ్వరస్వామిని ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజూ సభలో అపవిత్రం చేస్తున్నారని, ఇవాళ బూట్లు, చెప్పులు ధరించి స్వామి ఫొటోలను చేతపట్టుకుని ప్రదర్శించడం, టేబుల్‌పై స్వామి చిత్రపటాలను విసిరివేయడంపై నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి దేవుడి ఫొటోలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. మోషేన్‌రాజు స్పందిస్తూ.. వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని.. వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. మాట్లాడడం కాదని, బహిరంగ క్షమాపణలు చెప్పించి, లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. తర్వాత బొత్సను చైర్మన్ తన చాంబరుకు పిలిపించి వివరణ కోరారు. జరిగినదానికి క్షమాపణ చెబుతారా అని అడిగారు. తామెందుకు క్షమాపణలు చెబుతామని బొత్స అన్నారు. తమ సభ్యులు తన సీటు వద్దే బూట్లు, చెప్పులు విడిచి పోడియం దగ్గరకు వచ్చారని చెప్పారు. మండలి నడవకుండా ఇలాగే కొనసాగడం సరికాదని.. ఇరుపక్షాల నుంచి ముగ్గురేసి సభ్యులు కూర్చుని సంప్రదింపులు జరుపుకోవాలని చైర్మన్ సూచించారు. తర్వాత 1.07 గంటలకు మండలి పునఃప్రారంభమైంది. వైసీపీ సభ్యులు మళ్లీ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వచ్చారు. చంద్రబాబు గతంలో బూట్లు వేసుకుని శ్రీవారి ఫొటో పట్టుకున్నట్లు ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబే భక్తులకు క్షమాపణ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 రోజులుగా సభను అడ్డుకోవడం సరికాదని బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఈ పరిణామాలతో ఒక్క నిమిషంలోనే (1.08గంటలకు) సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా మండలిలో బడ్జెట్‌పై చర్చే కాదు.. అసలే కార్యకలాపాలూ సాగలేదు.
మహిళా ఎమ్మెల్సీలకు చీరలు
సభ వాయిదా పడ్డాక వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స చాంబర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళా సభ్యులకు బొత్స చీరలు బహూకరించారు. దీంతో.. పురుష ఎమ్మెల్సీలు తమకూ కావాలని డిమాండ్ చేశారు. వారికి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని చేనేత స్టాల్స్ నుంచి చీరలు కొని అందిస్తామని బొత్స చెప్పారు.
ప్రభుత్వం తోకముడిచింది: బొత్స
మండలిలో ప్రభుత్వం తోకముడిచిందని బొత్స అన్నారు. సభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణ బయట వైసీపీ అనుకూల మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు. ‘మా సభ్యులు సభలో చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటో పట్టుకున్నట్లు ఒక్క ఆధారం గానీ, క్లిపింగ్ గానీ చూపెట్టమనండి’ అని సవాల్ విసిరారు. దీనికి మంత్రి లోకేశ్ తక్షణమే ‘ఎక్స్’లో స్పందించారు. మండలిలో బొత్స తాము బూట్లు, చెప్పులతో స్వామి చిత్రపటాన్ని పట్టుకోలేదని చెప్పిన వీడియోను.. వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో స్వామి ఫొటోలను పట్టుకున్న వీడియోను కలిపి ట్యాగ్ చేశారు.