Share News

డిజిటల్‌ గవర్నెన్స్‌లోతెలంగాణ రోల్‌ మోడల్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:59 AM

కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్‌ గవర్నెన్స్‌లో దేశానికే తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు...

డిజిటల్‌ గవర్నెన్స్‌లోతెలంగాణ రోల్‌ మోడల్‌

  • ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు

  • సామాన్యుడి చెంతకు అత్యాధునిక సాంకేతికత

  • ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో మంత్రి దుద్దిళ్ల

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్‌ గవర్నెన్స్‌లో దేశానికే తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటరింగ్‌తో విప్లవాత్మక మార్పులొస్తాయని, తద్వారా సామాన్యుడికి చెంతకు అత్యాధునిక సాంకేతికత చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్‌ - 2047’లో టెక్నాలజీయే కీలకమని న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ - 2026’లో భాగంగా శుక్రవారం ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన చెప్పారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, బ్లాక్‌ చెయిన్‌ వంటి ‘కటింగ్‌ ఎడ్జ్‌’ సాంకేతికతలను సాఫ్ట్‌వేర్లుగా మాత్రమే కాక సామాన్యుడి జీవితాల్లో మార్పు తెచ్చే ‘ పరివర్తన సాధనాలు (ట్రాన్స్‌ఫార్మేషన్‌ టూల్స్‌)’ గా మారుస్తున్నామన్నారు. ‘సాంకేతిక ఫలాలు కేవలం ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితం కాకూడదు. అందుకే ‘ఏజెంటిక్‌ ఏఐ’ ద్వారా ప్రతి ఒక్కరికీ సేవలు అందేలా చూస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఐకం (ఏఐకేఏఎం), భూ భారతి వంటి సంస్కరణలు డిజిటల్‌ రంగంలో తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి’ అని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. కేవలం ఐటీకే పరిమితం కాకుండా.. వ్యవసాయం, ఆరోగ్యం, క్లీన్‌ ఎనర్జీ, విపత్తు నిర్వహణ రంగాల్లోనూ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

పెట్టుబడులకు స్వర్గధామం..

ప్రతి పల్లెకు సాంకేతికతను చేర వేయడానికి ‘టీ-ఫైబర్‌’ ద్వారా బృహత్తర యజ్ఞం కొనసాగుతోందని మంత్రి దుద్దిళ్ల చెప్పారు. ప్రభుత్వ సేవలు అవినీతికి తావులేకుండా నేరుగా ప్రజలకు అందేలా టీ-ఫైబర్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. స్వీడన్‌ వాణిజ్య ప్రతినిధులతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్‌ సరఫరా, స్థిరమైన పారిశ్రామిక విధానాలతో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, నూతన ఆవిష్కరణలతో వచ్చే గ్లోబల్‌ టెక్‌ కంపెనీలకు ఎల్లప్పుడూ తెలంగాణ స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో మార్పులు రావడం సహజమన్న దుద్దిళ్ల.. ఆ సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని సర్కారు ముందుచూపుతో అడుగులు వేస్తోందని తెలిపారు. తెలంగాణ అపారమైన ప్రతిభావంతులకు నిలయమని చెప్పారు. గత రెండేళ్లుగా ‘స్కిల్లింగ్‌, రీ-స్కిల్లింగ్‌’ లపై ప్రత్యేక శ్రద్థ పెట్టామన్నారు. ఏఐ పరిశోధనలతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, యువత వాటిని అందుపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని దుద్దిళ్ల పిలుపునిచ్చారు.

Updated Date - Feb 21 , 2026 | 03:59 AM