ఆయేషా కేసు క్లోజ్!
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:51 AM
ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సీబీఐ కోర్టు కొట్టివేసింది.
హత్యాచారం కేసు కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు
విజయవాడ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సీబీఐ కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తునట్లు ప్రకటించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘బాధితులు (ఆయేషా తల్లిదండ్రులు) కోరుకుంటే ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ సహాయం అందించడానికి కోర్టు సిద్ధంగా ఉంది. అయితే కేసులో నిందితులను తేల్చడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఇక న్యాయపోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని బాధితులు చెప్పారు. వారి అభిప్రాయాలు, వాదప్రతివాదనలను విన్న తర్వాత కేసును కొట్టివేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోర్టులో ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, సీబీఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ వాదనలు వినిపించారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆయేషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత.. రీపోస్టుమార్టం కోసం తెనాలిలోని ఆమె సమాధి నుంచి కొన్ని అవశేషాలను సేకరించారు. హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వాస్పత్రి వైద్యులు రీపోస్టుమార్టం నివేదిక అందజేశారు. తర్వాత సీబీఐ ఆ అవశేషాలను కోర్టుకు అప్పగించింది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని ఆయేషా తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయాధికారి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన ఉదయం పది గంటలకు ఆయేషా తల్లిదండ్రులు, సీబీఐ అధికారులు కోర్టుకు రావాలన్నారు. అవశేషాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని, ఎస్కార్ట్, భద్రతను సమకూర్చాలని సీబీఐ అధికారులను ఆదేశించారు. ఈ వాహనాన్ని తెనాలిలోని ఆయేషా సమాఽధి ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లాలని.. సీబీఐ, రెవెన్యూ అధికారులు, పోలీసులు, మతపెద్దల సమక్షంలో మత సంప్రదాయం ప్రకారం అవశేషాలను ఖననం చేయాలని.. ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని తీర్పులో స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా విజయవాడ ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ చదివేది. 2007 డిసెంబరు 27న హాస్టల్లో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పిడతల సత్యంబాబును 2008 ఆగస్టు 16న అరెస్టు చేశారు. కేసును విచారించిన మహిళా సెషన్స్ కోర్టు.. అతడిని దోషిగా నిర్ధారిస్తూ.. 2009 సెప్టెంబరు 30న జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై సత్యంబాబు 2010లో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు 2017 మార్చి 30న అతడిని నిర్దోషిగా నిర్ధారించి తీర్పు వెలువరించింది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు 2018 జనవరి 27న హైకోర్టులో అప్పీలు చేశారు.
కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో 2018 డిసెంబరు 16న కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టి ఐదేళ్లయినా ఎలాంటి ప్రగతీ లేదని ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడంతో... సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం చేయించారు. దర్యాప్తు పూర్తయిందంటూ గతేడాది హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కొత్త సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ లేవని, కేసు రికార్డు ధ్వంసమైందని నివేదించారు. ఘటన జరిగినప్పుడు ఆయేషాతోపాటు హాస్టల్లో ఉన్న స్నేహితులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. ఆమెకు ఐదుగురు స్నేహితులు ఉండగా.. ముగ్గురి వాంగ్మూలాన్ని వాట్సాప్ ద్వారా నమోదు చేసినట్లు వెల్లడించారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేయలేదని ఆయేషా తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితమే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మొత్తం కేసును కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ర్టేషన్లు
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ