27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ర్టేషన్లు
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:41 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం ‘యువికా-2026’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం ‘యువికా-2026’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని, 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి కలిగించేందుకు ఇస్రో ఏటా ‘యువికా’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్‌లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నారు. మేలో రెండు వారాల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో పాటు డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.