Share News

బాలికల విద్యకు కేంద్రం భరోసా

ABN , Publish Date - Feb 21 , 2026 | 10:27 AM

దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్‌ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

బాలికల విద్యకు కేంద్రం భరోసా

  • ఉమ్మడి జిల్లాలో ఆరు కేంద్ర ప్రభుత్వ హాస్టళ్లు

  • జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటుకు అవకాశం

  • ఒక్కో హాస్టల్‌ 5 ఎకరాల్లో రూ.50కోట్లతో నిర్మాణం

  • ఇంజనీరింగ్‌ విద్యార్థినులకు ప్రయోజనం

  • బాలికలతో పాటు ఉద్యోగ వేటలో ఉన్న మహిళలకు చోటు

  • బాలికల డ్రాపౌట్లు తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు

వరంగల్: దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్‌ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ లెక్కన వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఆరు బాలికల హాస్టళ్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని జిల్లా కేంద్రంలో, ప్రధానంగా జాతీయ సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కేంద్రియ విద్యాలయాలకు దగ్గరలో ఏర్పాటు చేస్తారు.


తగినంత స్థలం దొరికితే ఈ విద్యాలయాల ప్రాంగణాల్లోనే నెలకొల్పే అవకాశం ఉంది. వీటిని ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో, ఎంత ఖర్చుతో నిర్మిస్తారనేది ఇంకా స్ఫష్టం కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో హాస్టల్‌లో గరిష్టంగా 2500మందికి వసతి కల్పించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వరంగల్‌ నిట్‌లో రూ.100కోట్లతో నిర్మాణం అవుతున్నలేడీస్‌ హాస్టల్‌ తరహాలోనే వీటి నిర్మాణం ఉంటుంది. పేరుకే ఇవి బాలికల హాస్టళ్లయినా ఇందులో ఉద్యోగ వేటలో పట్టణాలకు వచ్చే ఒంటరిగా మహిళలకు కూడా చోటు కల్పిస్తారు.


ఈ నిర్ణయం వెనుక

ప్రతీ జిల్లాకు ఒక బాలికల హాస్టల్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక బాలిక తల్లిదండ్రుల ఆవేదన ఉంది. కేంద్ర బడ్జెట్‌ తయారు చేసే ముందు విద్యారంగంపై బాలికల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. తగిన హాస్టళ్లులేక పోవడం వల్ల ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వపరంగా తగినంత హాస్టల్‌ వసతి లేనందువల్ల పిల్లల భద్రత తగినం త భద్రత లేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.


girl.2.jpgప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో ప్రవేశాలు పరిమితంగా ఉన్నాయని, ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తే అక్కడ తగినంత సురక్షిత వాతావరణం లేకపోగా పెద్దమొత్తంలో ఫీజు చెల్లించాల్సిరావడంతో ఆర్థికంగా భారమవుతోందని తెలిపారు. దీంతో చాలా మంది పేద బాలికలు నగరాలు, పట్టణాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టు కొని కేంద్ర ప్రభుత్వం జిల్లాలో బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది. మారుమూల, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, మహిళా ఉద్యోగులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బాలికల హాస్టల్‌ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది.


బాలికలకు ఊరట

ఉన్నత విద్యను చదువుకోవాలనే ఆశతో పట్టణాలకు, నగరాలకు వెళ్లే విద్యార్థినులకు ఈ స్కీమ్‌ గొప్ప ఊరట కలిగించనున్నది. ప్రస్తుతం చాలా జిల్లాల్లో బాలికల హాస్టల్‌ సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు ప్రతీ రోజు 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. లేదా అద్దె గదుల్లో సురక్షితం కాని పరిస్థితుల్లో నివసించాల్సి వస్తోంది. అలాంటి వారి సౌకర్యం కోసం హాస్టళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ వంటి కోర్సులను అభ్యసించే విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరస్తుంది.


విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం వసతి సమస్యను తగ్గించడంవల్ల సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ కోర్సులలో బాలికల ప్రవేశాలు పెరుగుతాయి. విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రణాళికపై పని చేస్తోంది. ఇది ఇప్పుడు బడ్జెట్‌ ద్వారా ఆమోదం పొందింది.

కొత్త విద్యా విధానం ప్రకారం ఉన్నత విద్యలో ప్రవేశాలను 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ సంఖ్య 29 శాతంగా ఉంది. బాలికల హాస్టళ్లను నిర్మించడం వల్ల ఉన్నత విద్యలో బాలికల భాగస్వామ్యం పెరుగుతుందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో సహాయ పడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.


ఉద్యోగ వేటలో ఉన్న మహిళలకూ..

జిల్లాలో బాలిక హాస్టల్‌ పథకం ప్రయోజనాలు విద్యార్థినులకు మాత్రమే పరిమితం చేయలేదు. ఉద్యోగాల కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చే మహిళలు కూడా ఈ హాస్టళ్లలో ఉండే వీలు కల్పిస్తారు. ఇందులో మహిళలకు సురక్షితమైన వసతి సౌకర్యాన్ని అందిస్తుంది. వారు మెరుగైన ఉపాధి అవకాశాలు ఎంచుకోవడం సులభతరం అవుతుంది. ఈ యేడు బడ్జెట్‌ అభివృద్ధి, సమ్మిళితం, సామాజిక సాధికారతకు ప్రాధాన్యతనిపస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నందు వల్ల ప్రతీ జిల్లాలో బాలికల హాస్టళ్ల నిర్మాణం ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగగా పరిగణించవచ్చు. ఇది విద్య, ఉపాధి రెండింటిలోనూ మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని భావించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

చరిత్రను తిరగరాసిన సరిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 11:05 AM