Share News

చరిత్రను తిరగరాసిన సరిత

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:00 AM

నీలి ఆకాశం.. మంచు కురిసే కొండలు.. మలుపులు తిరిగే పట్టాలు! 146 ఏళ్ల డార్జిలింగ్‌ టాయ్‌ ట్రైన్‌ చరిత్రలో ఇప్పటి వరకు వినిపించని ఒక కొత్త సంతకం.. సరిత యోల్మో. పురుషులకే పరిమితమైన బాధ్యతను చిరునవ్వుతో స్వీకరించి, హిమాలయాల సాక్షిగా సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ‘వండర్‌ ఉమెన్‌’ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.....

చరిత్రను తిరగరాసిన సరిత

నీలి ఆకాశం.. మంచు కురిసే కొండలు.. మలుపులు తిరిగే పట్టాలు! 146 ఏళ్ల డార్జిలింగ్‌ టాయ్‌ ట్రైన్‌ చరిత్రలో ఇప్పటి వరకు వినిపించని ఒక కొత్త సంతకం.. సరిత యోల్మో. పురుషులకే పరిమితమైన బాధ్యతను చిరునవ్వుతో స్వీకరించి, హిమాలయాల సాక్షిగా సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ‘వండర్‌ ఉమెన్‌’ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది!

డార్జిలింగ్‌ మంచు కొండల మధ్య కూత పెడుతూ సాగే టాయ్‌ ట్రైన్‌ ప్రయాణం పర్యాటకులకు ఒక మధుర స్వప్నం. అయితే ఫిబ్రవరి 5 నుంచి ఆ ప్రయాణంలో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. తెల్లటి యూనిఫాం ధరించి, చిరునవ్వుతో టికెట్లు తనిఖీ చేస్తూ పర్యాటకులను పలకరిస్తున్న 55 ఏళ్ల సరిత యోల్మో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. న్యూ జల్పాయిగురి నుంచి డార్జిలింగ్‌ వరకు సాగే 10 గంటల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఒక్కరే టీటీఈగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చరిత్ర సృష్టించారు.

అనౌన్సర్‌గా మొదలై.. ఆఫీసర్‌గా ఎదిగి

సరిత ప్రయాణం ఏమీ పూలబాట కాదు. 1991లో రైల్వేలో సాధారణ ఉద్యోగినిగా చేరిన ఆమె.. తన 34 ఏళ్ల కెరీర్‌లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మొదట కుర్సియాంగ్‌లోని రైల్వే ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేశారు. అయితే, ఆ ప్రెస్‌ మూతపడటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. 2019లో న్యూ జల్పాయిగురికి బదిలీ అయిన ఆమె అక్కడ రైల్వే అనౌన్సర్‌గా, ఆ తర్వాత ఎంక్వైరీ కౌంటర్‌లో పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన పట్టుదలతో ఎట్టకేలకు కమర్షియల్‌ విభాగానికి మారి నేడు ప్రతిష్ఠాత్మకమైన టీటీఈ హోదాను దక్కించుకున్నారు.

పర్యాటకుల ఆనందం

సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఐదారుగురు టీటీఈలు బృందంగా పనిచేస్తారు. కానీ, డార్జిలింగ్‌ టాయ్‌ ట్రైన్‌లో సరిత ఒక్కరే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ‘‘మొదట్లో కాస్త కంగారు పడ్డాను, కానీ ప్రయాణికుల ఆదరణ చూశాక అంతా మర్చిపోయాను’’ అని ఆమె ఆనందంగా చెబుతారు. ఒక మహిళా ఆఫీసర్‌ని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమెతో ఫొటోలు దిగడానికి పోటీపడుతున్నారు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, ప్రయాణికులతో మానవీయ సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం అని ఆమె అంటారు.

బాధ్యత గల తల్లి

సరిత విజయం వెనుక ఆమె కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆమె భర్త దావా యోల్మో రైల్వేలోనే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ‘‘సరిత అంకితభావం కలిగిన ఉద్యోగి మాత్రమే కాదు.. బాధ్యత గల తల్లి, మంచి భార్య కూడా. ఇప్పుడు ఆమెపై మరింత బాధ్యత పెరిగింది’’ అని ఆయన గర్వంగా చెబుతారు. ఇటు కుటుంబాన్ని, అటు వృత్తిని బ్యాలెన్స్‌ చేస్తూ ఆమె సాగిస్తున్న ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Updated Date - Feb 21 , 2026 | 12:00 AM