Share News

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:55 AM

దేశంలోని వైద్య కళాశాలలకు ఊరటనిస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుస్తున్న మెడికల్‌ ....

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

  • రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇక అక్కర్లేదు!

  • పాత వైద్య కాలేజీలకు ఊరటినిస్తూ ఎన్‌ఎంసీ ముసాయిదా విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దేశంలోని వైద్య కళాశాలలకు ఊరటనిస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుస్తున్న మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సులు ప్రారంభించే ప్రక్రియలో ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ముసాయిదాను విడుదల చేసింది. ఇకపై పాత కాలేజీలు కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌’ (ఈసీ) పొందాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన కొత్తగా స్థాపించే మెడికల్‌ కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ‘ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ నిబంధనలకు సవరణలు చేసింది. అయితే, కాలేజీల ఆర్థిక పటిష్ఠతను పెంచేందుకు ఎన్‌ఎంసీ ఒక కొత్త నిబంధనను కూడా ముందుకు తెచ్చింది. ప్రతి వైద్య సంస్థ (కొత్తదైనా, పాతదైనా) తప్పనిసరిగా ‘కార్పస్‌ ఫండ్‌’ నిర్వహించాల్చి ఉంటుంది. ఈ నిధులను కేవలం కాలేజీ నిర్వహణ, అభివృద్ధి కోసమే కేటాయించాలని ఆదేశించింది. దీనితో పాటు యూనివర్సిటీ నుంచి పొందే ‘కన్సెంట్‌ ఆఫ్‌ అఫిలియేషన్‌’ దరఖాస్తు చేసే నాటికి వాలిడిటీ కలిగి ఉండాలని సూచించింది. మరోవైపు నిబంధనల అమలులోనూ ఎన్‌ఎంసీ కఠిన వైఖరిని ప్రదర్శించింది. అనుమతుల కోసం కాలేజీలు సమర్పించే దరఖాస్తులు అసంపూర్ణంగా ఉంటే, ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే వాటిని నేరుగా తిరస్కరిస్తామని, సవరణలకు కూ అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే మార్చి 18లోపు మెయిల్‌ ద్వారా తెలియజేయాలని ఎన్‌ఎంసీ కోరింది.

Updated Date - Feb 21 , 2026 | 03:55 AM