Share News

ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:16 PM

గ్రామాల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్‌ ప్రొఫైల్‌లో నమోదు చేస్తున్నారు.

ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..

  • ప్రతీ గ్రామ పంచాయతీకి డిజిటల్‌ ప్రొఫైల్‌

  • జనాభా నుంచి నీటి వనరుల వరకు సమాచార సేకరణ

  • గ్రామాభివృద్ధి కోసం మూడేళ్ల ప్రణాళికలు

  • జిల్లాలో మొదలైన డిజిటలైజేషన్‌ ప్రక్రియ

  • ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు

వరంగల్‌ సిటీ: గ్రామాల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్‌ ప్రొఫైల్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి అవసరాలు, వనరులు, సమస్యలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతీ పంచాయతీ కి ప్రత్యేక డిజిటల్‌ ప్రొఫైల్‌ను రూపొందిస్తోంది. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం తోపాటు ప్రస్తుత అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భవిష్యత్‌ ప్రణాళికలను సైతం ఇందులో పొందుపరుస్తారు.


వరంగల్‌ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు డిజిటలైజేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితి, కుటుంబాల సంఖ్య, వ్య వసాయ భూములు, సాగునీటి వనరులు, రహదారుల పరిస్థితి, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి కూలీలు వంటి వివరాలన్నీ ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రస్తుత పనులు, భవిష్యత్‌ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలనూ డిజిటల్‌ ప్రొఫైల్లో పొందు పరుస్తున్నారు.

ఇందుకోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృది శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఈ డిజిటల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు.


hnk3.jpgఅన్ని వివరాలు ప్రొఫైల్‌లో..

గ్రామపంచాయతీ ప్రొఫైల్లో భౌగోళిక వివరాల నుంచి ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వరకు సమాచారం పొందుపరుస్తున్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన గ్రామస్థాయి ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వివరాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా గ్రామ జనాభా, సామాజిక వర్గాలు, అక్షరాస్యత, వయస్సుల వారీ వివరాలు, జీవనాధార వృత్తులు, రైతుల సంఖ్య, సన్న, చిన్న, మధ్యతరహా, పెద్ద రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు.


hnk3.2.jpgవ్యవసాయ భూ ములు, సాగు పరిస్థితులు, చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యం వివరాలు అందుబాటులోఉంటాయి. గ్రామంలోని రహదారుల పొడవు, విద్యుత్‌ సదుపాయాలు, పారిశుధ్యం, గృహాల సంఖ్య, వాటి కేటగిరీలను డిజిటల్‌ ప్రొఫైల్లో పొందుపరుస్తున్నారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు, వాటిలోని పిల్లల సంఖ్య,పాఠశాలలు, విద్యార్థుల వివ రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు, సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధిహామీ కూలీల సంఖ్య, తాగునీటి వసతులు వంటి వివరాలు ఉంటాయి.


పనుల తనిఖీలు.. సమీక్షలు సులభం

ఈ ప్రొఫైల్‌ ద్వారా గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మరింత పారదర్శకత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో గ్రామసభల్లో ప్రధానంగా గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాలపైనే సమీక్ష జరిగేది. ఇక సమగ్ర డిజిటల్‌ ప్రొఫైల్‌ అందుబాటులోకివస్తే గ్రామంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలను సైతం ఒకే వేదికపై సమీక్షించేందుకు వీలు కలుగుతుంది. జిల్లా, మండలస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించినప్పుడు సంబంధిత శాఖల వివరాలు ముందుగానే అందుబాటులో ఉండటంతో తనిఖీ లు సులభతరంఅవుతాయి. గ్రామ పరిస్థితిని సమగ్రంగా అం చనావేసి, అవసరమైన అభివృద్ధి చర్యలను ప్రాధాన్యతా క్ర మంలో చేపట్టేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.


మూడేళ్ల ప్రణాళికకు వేదిక..

గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కేవలం ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలను 2026-2027, 2027-2028, 2028-2029 సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌ అంచనాలు, గుర్తించిన అభివృద్ధి పనులు, వివిధ శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఇందులో నమోదు చేస్తున్నారు. గ్రామానికి ఏం కావాలి? ఏ రంగంలో లోటుపాట్లు ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఏ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై దృష్టి పెట్టేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్యదర్శులు వివరాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఫణం..

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 12:16 PM