అసమానతలపై అగ్నిధార
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:17 AM
అసమానతలు, అన్యాయాల మీద అగ్నిధారలు కురిపించిన కవితా సారథి దాశరథి. నిజాం నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన చైతన్య వారధి.
నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన ధీశాలి
సినీ గీతాలతో అలరించిన కవి
చిన్నగూడూరు(మహబూబాబాద్): అసమానతలు, అన్యాయాల మీద అగ్నిధారలు కురిపించిన కవితా సారథి దాశరథి. నిజాం నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన చైతన్య వారధి. అన్నార్తులు, అనాథలుండని సమ సమాజాన్ని కాంక్షించిన సామ్యవాది. రుద్రవీణతో తెలంగాణను తట్టి లేపిన ప్రగతిశీలి. అద్భుతమైన పాటలతో తెలుగు సినీ సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గీత రచయిత. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ఎలుగెత్తి చాటిన దాశరథి కృష్ణమాచార్యుల జయంతి నేడు.
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యాల్లో గొప్ప కవిత్వ మెళకువలు ఎరిగిన లాక్షణికుడు దాశరథి. ఆంధ్ర మహాసభలోనూ గణనీయమైన పాత్ర పోషించారు. తెలంగాణ మట్టి స్వభావాన్ని తన కవితాక్షరాలలో పొదిగి, ప్రజలతో మమేకమయ్యారు. గాలిబ్ గీతాలను తెలుగులో అనువదించారు. పర్షియన్ భాషలో నాలుగు పాదాలతో కూడిన రసాత్మకమైన రుబాయత్‌లను రుబాయిలుగా తెలుగులో ప్రయోగాత్మకంగా రాశారు. భారత ప్రభుత్వ నాయకత్యంపై వ్యంగ్యాత్మకంగా రాసిన రుబాయి ఇది- కళ్లెం ఉన్నది చేతిలో.. గుర్రం మాత్రం పడ్డది గోతిలో.. స్వర్గమును గూర్చి నాకు సర్వము తెలియు.. మనసు సంతపడుటకు మంచి.. ఊహ ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము.. నరుడు నరుడౌట యెంతో దుష్కరము సుమ్ము.. అంటూ దాశరథి కలం ద్వారా తెలుగులోకి వచ్చిన గాలిబ్ గీతాలు ఆలోచింపజేస్తాయి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం వంటి ఖండ కావ్యాలను వెలువరించారు.
దాశరథి కవితా పుష్పకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవితా పురస్కారం అందుకుంది. ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథిని నియమించింది. లేదు లేదు చల్లారగా.. లేదు పేదవాని గుండియలోని శ్మశాన వహ్ని.. కాల్చివేయును బంగారు గద్దెలెక్కి.. పేదలను సిగిరెట్లుగా పీల్చువారి ఊరి ఊరి పొలిమేరలు మారీ.. దేశ దేశ సహవాసం కోరీ.. జాతి మతాలను పాతరేసి పచ్చనోట్లతో కొందరు.. కత్తిపోట్లతో కొందరు.. ప్రజల ఓట్ల విలువను పడగొట్టాలని చూస్తున్నారు. వెనక్కి పోతూ.. ముందుకు పోతున్నమనుకునే.. వెర్రి వెంగళాయలు విజ్ఞాన జ్యోతులు.. అజ్ఞానపు రీతులు వంటి పంక్తులు ఆలోపించింపజేస్తాయి.
సినీ గేయాలు..
ప్రజా కవిత్వంతో పాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప సినిమా పాటలు రాశారు. ‘నీవురావు నిదుర రాదు’.. ‘ఖుషిఖుషిగా నవ్వుతూ’.. వంటివి ఆ కోవలోవే, ‘ఆ చల్లని సముద్ర గర్భం.. దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో’.. గేయాలు ఆయన రచనలో పదును చూపుతాయి. మహాకవి, అభ్యుదయకవి, కళాప్రపూర్ణ, ఆస్థానకవిగా బిరుదులు అందుకున్నారు.
చిన్నగూడూరులో జన్మించి..
1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు దాశరథి. తన తండ్రి వెంకటాచార్య నుంచి సంస్కృతం తల్లి వెంకటమ్మ నుంచి భాగవతం నేర్చుకున్నారు. కౌశవర్య శాస్త్రి వద్ద వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్నారు. 15 ఏళ్ల వయస్సులో 25 పద్యాలను అవలీలగా చెప్పి అప్పటి సుబేదార్ నారాయణరావు ప్రశంసలు పొందారు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా, ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. 1961లో సినీ రంగ ప్రవేశం చేసి వందలాది పాటలు రాశారు. కృష్ణమాచార్యులును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఘనంగా సత్కరించారు. 1987 నవంబర్ 5 తేదీన ఆయన కన్నుమూశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News