లిక్కర్ షాపులోకి చొరబడ్డ చిరుతపులి.. సీసీటీవీ కెమెరాలో రికార్డైన భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Jul 21 , 2026 | 02:40 PM
రాజస్థాన్‌లోని తోంక్ జిల్లాలో చిరుతపులి అలజడి సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన ఆ చిరుతపులి జనాలపై విరుచుకుపడింది. ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని తోంక్ జిల్లాలో చిరుతపులి అలజడి సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన ఆ చిరుతపులి జనాలపై విరుచుకుపడింది. ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ చిరుతపులి అటవీ ప్రాంతం నుంచి తోదరైసింగ్ పట్టణంలోకి వచ్చింది. పొదల్లో చిరుతపులిని చూసిన జనం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ వాలంటీర్ రాకేశ్ మాలి సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఆ చిరుతపులి అతడిపై దాడి చేసింది. అతడి కాళ్లను తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అక్కడినుంచి మార్కెట్‌లోకి పరిగెత్తింది. నేరుగా లిక్కర్ షాపు దగ్గరకు వెళ్లింది. లిక్కర్ షాపు బయట కూర్చున్న 40 ఏళ్ల ఫతేహ్ లాల్ కోలీ అనే వ్యక్తిని గాయపరిచింది. లిక్కర్ షాపులోకి చొరబడింది. లోపల ఉన్న సంజయ్ గుర్జర్ అనే 25 ఏళ్ల యువకుడిపై కూడా దాడి చేసింది. అతడు దానినుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాడు.
చిరుతపులి లోపల ఉండగానే స్థానికులు షట్టర్ క్లోజ్ చేశారు. గాయపడ్డ వారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ అశోక్ తన్వర్ నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. దాదాపు 5 గంటలు కష్టపడ్డ తర్వాత అటవీ అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు. లిక్కర్ షాపునుంచి అటవీ ప్రాంతంలోకి దాన్ని తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో జనం ఆ ప్రాంతంలోకి వచ్చారు. వారిని అదుపు చేయటం కోసం పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల