Share News

ఒకరు.. ఇద్దరు కాదు.. బైక్‌పై ఏకంగా నలుగురు పోలీసులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:25 PM

దేశంలో చట్టాలు అందరికీ సమానమే. వాటికి ఎవరూ అతీతులు కాదు. చివరికి ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా క్షేమంగా గమ్యస్థానం చేరుకోవచ్చని వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తారు.

ఒకరు.. ఇద్దరు కాదు.. బైక్‌పై ఏకంగా నలుగురు పోలీసులు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమే. వాటికి ఎవరూ అతీతులు కాదు. చివరికి ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా క్షేమంగా గమ్యస్థానం చేరుకోవచ్చని వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ముఖ్య కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ సూచనలు మైక్ ద్వారా వారు చేస్తూ ఉంటారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి, కారులో ప్రయాణిస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తదితర ట్రాఫిక్ రూల్స్ తూచా తప్పకుండా పాటించాలంటూ వారు సూచిస్తారు. వాహనదారుల భద్రతే తమ ప్రధమ కర్తవ్యమని వారంతా విధులు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. పోలీస్ శాఖలో కొందరికి ఈ ట్రాఫిక్ రూల్స్ ఏ మాత్రం పట్టవని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.


నలుగురు పోలీసులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తున్నారు. సాధారణంగా ప్రజలకు చట్టం, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పే పోలీసులే.. ఇలా చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైక్‌పై ముందు కూర్చొన్న పోలీస్ హెల్మెట్ పెట్టుకున్నాడు. అతడి వెనుక కూర్చున్న ముగ్గురు హెల్మెట్ ధరించలేదు. బైక్‌పై నిర్లక్ష్యంగా కూర్చున్నారు. ఇక ఈ బైక్ నంబర్ ప్లేట్ పరిశీలిస్తే.. బిహార్‌కు చెందినదిగా స్పష్టమవుతుంది. ఈ బైక్ వెనుక ప్రయాణిస్తున్న వాహనదారుడు ఈ వీడియోను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను @gharkekalesh అనే యూజర్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటి వరకు వేలాది మంది ఈ వీడియోను వీక్షించి.. లైక్ చేశారు.


ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించారని పలువురు అభిప్రాయపడ్డారు. పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మరికొందరు విమర్శించారు. చట్టాలు కేవలం సామాన్యుల కోసమే చేస్తారని తెలిపారు. మరి వారే ఎందుకు పాటించరని పోలీసులను వారు సూటిగా ప్రశ్నించారు. సామాన్యులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే.. వారిపై జరిమానా విధిస్తారు. మరి పోలీసులే ఈ నియమాలను అతిక్రమిస్తే.. వారిపై ఎవరు చర్యలు తీసుకుంటారని నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 03:36 PM