Share News

వంట నూనెల ధరలు సలసల

ABN , Publish Date - May 02 , 2026 | 01:45 PM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. యుద్ధం సాకుచూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

వంట నూనెల ధరలు సలసల
Cooking Oil

  • 30 శాతం పెరుగుదల

  • ప్రజలపై అదనపు భారం

  • ఇరాన్‌ అమెరికా యుద్ధం సాకు

  • వ్యాపారుల సిండికేట్‌

  • జోరుగా కల్తీ... పట్టించుకోని అధికారులు

  • ఇబ్బందులు పడుతున్న జనం

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. యుద్ధం సాకుచూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధరలను అమాంతంగా పెంచేశారు. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగింది. సన్‌ప్లవర్‌ ఆయిల్‌ రూ. 180 నుంచి రూ. 200, పామాయిల్‌ రూ. 120 నుంచి రూ. 145, వేరు శనగ నూనె రూ. 15 నుంచి రూ.20 కు చేరింది. 5 కిలోల డబ్బా రూ.1000 నుంచి రూ. 1150లకు, 15 కిలోల టిన్ను (‘హోల్‌సేల్‌) రూ. 2300 నుంచి రూ. 2400 వరకు పెరిగింది.


రైస్‌ బ్రౌన్‌ నూనె ధర లీటర్‌ రూ. 150 నుంచి రూ. 165లకు పెరిగింది. వనస్పతి అయిల్‌ లీటరు రూ. 130 నుంచి రూ. 160, సోయాబీన్స్‌ ఆయిల్‌ రూ. 150 నుంచి రూ. 170కి చేరింది. ఆవ నూనే రూ .130 నుంచి రూ. 160కి చేరింది. వంట నూనేల ధరలు ఇలా ఆకాశానికి ఎగబాకుతుండడంతో సామాన్యుడి నిత్యావసరాల బడ్జెట్‌ అమాంతంగా పెరుగుతోంది. ఇప్పటికే గ్యాస్‌ ధర పెరిగింది. ఇప్పుడు వంట నూనేల ధరలు అమాంతం పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థ్ధికంగా సతమతమవతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెత పెరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.


xx.jpgప్రత్నామ్నాయం వైపు...

ధరల భారం తట్టుకోలేక చాలా మంది సన్‌ప్లవర్‌ ఆయిల్‌కు బదులుగా రైస్‌బ్రాన్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ వైపు మళ్లుతున్నారు. ఇవి సన్‌ప్లవర్‌ ఆయిల్‌ కన్నా రూ. 10 నుండి రూ 20 వరకు తక్కువ ధరకే దొరుకుతుండడం ఇందుకు కారణం. వంటనూనెల తయారీ కంపెనీలు, హోల్‌సేల్‌, రిటేల్‌ వ్యాపారులు తమ పాత స్టాక్‌ ద్వారా లాభాలను కాపాడుకుంటున్నప్పటికీ సామాన్యుడికి మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నెలకు వివిధ రకాల వంట నూనెల వినియోగం సగటున 15 నుంచి 17 లక్షల లీటర్ల మేరకు వినియోగం జరుగుతుందని అంచనా. ఉమ్మడి జిల్లాలో నెలకు రూ. 75 నుంచి రూ. 80 కోట్ల మేర వంట నూనెల వ్యాపారం జరుగుతోంది. ధరల పెరుగుదల వల్ల వినియోగదారులపై నెలకు రూ. 5 కోట్ల భారం సామాన్యులపై అదనంగా పడుతోంది.


యుద్ధ ప్రభావం

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రిఫైన్డ్‌, సన్‌ప్లవర్‌ ఆయిల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో నూనెల ధరలు పెరిగాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. భారత్‌కు అవసరమైన సన్‌ప్లవర్‌ ఆయిల్‌ ఎక్కువ భాగం ఉక్రేయిన్‌, రష్యాల నుంచి దిగుమతి అవుతుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరుకు రవాణా నౌకలు సురక్షితం కాదని భావించి కేఫ్‌ అఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తున్నందు వల్ల దూరం, సమయం పెరగడమే కాకుండా వార్‌ రిస్క్‌ ఇన్సురెన్స్‌ ప్రీమియంలు షిప్పింగ్‌ కంపెనీలకు మారాయనీ చెబుతున్నారు. యుద్ధం సద్దుమణిగి సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప నూనెల ధరల మంటలు తగ్గేలా లేవని చెబుతున్నారు. ఈ అదనపు లాజిస్టిక్‌ ఖర్చులనీ చివరికి వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి.


xxx.jpgతనిఖీలు ఏవీ ?

సాధారణంగా మార్కెట్‌లో ఏవైనా వస్తువుల ధరలు ఆకస్మాత్తుగా పెరిగితే అందుకు కారణం వ్యాపారులు సిండికేట్‌ కావడం లేదా సరుకును బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం. ఈ రెండింటిని అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు హోల్‌సేల్‌ డీటర్లు, రిటైల్‌ మార్చంట్లపై తనిఖీలు నిర్వహించాలి. విజిలెన్స్‌ అధికారులు ఎక్కడిక్కడ దాడులు నిర్వహించాలి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేయాలి. తూనికలు, కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరపాలి. అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేయాలి. కంపెనీల స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఇవేవి జరగడం లేదు.


నూనెల కల్తీ

వంట నూనెల కృత్రిక కొరత, అధిక ధరల నేపథ్యంలో కల్తీ జోరుగా జరుగుతోంది. సన్‌ప్లవర్‌ ఆయిల్‌లో తక్కువ ధర కలిగిన పామాయిల్‌ కల్తీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల వంటల నూనెల కల్తీ జరుగుతున్నా కల్తీ నిరోధక శాఖ చర్యలు తీసుకోవడం లేదు. వంట నూనెల కల్తీని మొబైల్‌ టెస్టింగ్‌ లాబోరేటరీ ద్వారా గుర్తించాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల అధ్యక్షతన ధరల నియంత్రణ కమిటీలు లేకపోవడం వల్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్వహరిస్తున్నారు.


అధిక ఎమ్మార్పీ

వివిధ వంట నూనెల ఉత్పత్తిదారులు, అమ్మకందారులు అధిక ఎమ్మార్పీని ముద్రించి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నారు. వంట నూనెకు అసలు అమ్మకం ధర కంపెనీ బ్రాండెడ్‌ను బట్టి రూ. 750 నుంచి రూ.960 వరకు ఉండగా ఎమ్మార్పీని మాత్రం అధికంగా రూ. .1118లుగా ముద్రించి కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంట నూనెల వ్యాపారులు అసలు ధర కన్నా రూ. 300 ఎక్కువ ముద్రించి రూ. 250 డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు బిల్లులు రాయడం ద్వారా వ్యాపారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు ఎమ్మార్పీపై కాకుండా అసలు ధరపై జీఎ్‌సటీ వసూలు చేస్తున్నారు. దీని వల్ల గ్రామీణ వినియోగదారులు పెద్ద ఎత్తున మోసపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

కాస్త పట్టించుకోండి బాస్‌..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 01:45 PM