Share News

సీఏలకు భలే డిమాండ్ గురూ..

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:01 PM

సమాజంలో చార్టెట్‌ అకౌంట్స్‌ (సీఏ) పాత్ర కీలకమైనది. వారు కేవలం లెక్కలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు.

సీఏలకు భలే డిమాండ్ గురూ..
Chartered Accountants Day 2026

  • సమాజంలో వారి పాత్ర కీలకం

  • ఆర్థిక పారదర్శకతకు వారధులు

  • ఉమ్మడి వరంగల్‌లో 200 మంది సీఏలు రిజిస్ట్రేషన్‌

  • నేడు చార్టెడ్‌ అక్కౌంట్స్‌ డే

హనుమకొండ: సమాజంలో చార్టెట్‌ అకౌంట్స్‌ (సీఏ) పాత్ర కీలకమైనది. వారు కేవలం లెక్కలు చేసే వ్యక్తులు మాత్రమే కాదు. వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులు ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. సంస్థల ఆర్థిక లెక్కలను పరిశీలించి (ఆడిట్‌ చేసి) అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. ఆదాయ పన్ను, జీఎస్టీ వంటి పన్నుల విషయంలో చట్టబద్ధమైన సలహాలు అందించి, పన్ను నిబంధనలు పాటించడంలో సహాయపడతారు.


కొత్త వ్యాపారాల ప్రారంభం, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ వంటి అంశాల్లో మార్గదర్శనం చేస్తారు. ఆర్థిక అక్రమాలు, మోసాలను గుర్తించి, సంస్థల్లో జవాబుదారీతనం, విశ్వసనీయతను పెంచడంలో సహాయపడతారు. పరిశ్రమలు, కంపెనీలు సమర్థవంతంగా పని చేయడానికి దోహదపడతారు. పెట్టుబడిదారులు, బ్యాంకులు, ఇతర భాగస్వాములు సంస్థల ఆర్థిక నివేదికలను సమ్మడానికి చార్టెడ్‌ అకౌంటెంట్ల పని కీలకం. నేడు చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ దినం.


మెండుగా ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం దేశంలో సీఏలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారాల పెరుగుదల, పన్ను నిబంధనల్లో మార్పులు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తరణ వల్ల నైపుణ్యం కలిగిన సీఏలకు నిరంతరం డిమాండ్‌ ఉంది. ప్రైవేట్‌ కంపెనీలు, ఆడిట్‌ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు, స్టార్ట్‌పలు, బహుళజాతి కంపెనీల్లో ఉపాధి అవకాశాలున్నాయి. స్వతంత్రంగా సీఏ ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. నైపుణ్యం, అనుభవం, పని చేసే నగరం ఆధారంగా వేతనాలు మారుతాయి. సాధారణంగా కొత్తగా అర్హత పొందిన సీఏలకు సంవత్సరానికి రూ.8 నుంచి రూ. 15 లక్షల ప్యాకేజీ లభించవచ్చు. మంచి అనుభవం ఉన్న సీఏలు రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే అవకాశాలు ఉన్నాయి.


hnk1.2.jpgసీఏ కావడానికి చేయూత

వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వరంగల్‌ బ్రాంచ్‌ సీఏ వృత్తిలోకి రావాలనుకుంటున్న విద్యార్థులకు చేయూత నిస్తోంది. ఇంటర్‌ పూర్తయినవారు సీఏలో చేరడానికి అవసరమైన ఫౌండేషన్‌లో శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు సీఏ గురించి అవగాహన కల్పిస్తోంది. జూనియర్‌ కాలేజీలను సందర్శించి ఇంటర్‌ తర్వాత సీఏలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తోంది. డిగ్రీలో బీకాం చేస్తూనే సీఏలో చేరేందుకు గల అవకాశాలను తెలియజేస్తోంది. దీనితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు సహాయం చేస్తోంది. 4 దశాబ్దాల క్రితం ఉమ్మడి జిల్లాలో నలుగురైదుగురు సీఏలే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 250కి పైగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఐసీఏఐలో రిజిస్టరైనవారు 200 మంది, ప్రాక్టీసు చేస్తున్నవారు 60 మంది వరకు ఉన్నారు.


వరంగల్‌లో విస్తరిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు

ఉమ్మడి జిల్లాలో సీఏలుగా రాణించేందుకు అవకాశాలు గతంలోకన్నా మెరుగవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. వ్యాపార, వాణిస్య సంస్థలు వరంగల్‌ కేంద్రంగా తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. అనేక కార్పొరేట్‌ సంస్థలు వెలుస్తున్నాయి. రాంపూర్‌లో ఐటీ పార్క్‌, త్వరలో మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు, అభివృద్ధి చెందుతున్న పర్యాటకం, పెద్ద సంఖ్యలో వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరణతో సీఏలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం 5 వేల మందికి పైగా విద్యార్ధులు సీఏ చేస్తున్నారు.


సీఏ కావాలంటే..

చార్టెడ్‌ అకౌంటెంట్‌ వృత్తిలోకి రావాలంటే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ ఎకౌంట్‌్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) నిర్దేశించిన అర్హతలు, పరీక్షలు పూర్తి చేయాలి. 12వ తరగతి పూర్తి చేయాలి. సీఏ ఫౌండేషన్‌ కోర్సులో నమోదు చేసుకొని పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. (డిగ్రీ చేసినవారికి కొన్ని పరిస్థితుల్లో నేరుగా తదుపరి దశలోకి వెళ్లే అవకాశం ఉంటుంది) సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఉత్తీర్ణులు కావాలి. సాధారణంగా 2 సంవత్సరాల ప్రాక్టికల్‌ శిక్షణ (ఆర్టికిల్‌షిప్‌) పూర్తి చేయాలి. ఇందులో అనుభజ్ఞులైన చార్టెట్‌ అకౌంటెంట్‌ వద్ద శిక్షణ పొందుతారు. సీఏ ఫైనల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి.


అనంతరం ఐసీఏఐ సభ్యత్వం పొందితే అధికారికంగా చార్టెడ్‌ అకౌంటెంట్‌ అవుతారు. సీఏగా రాణించాలంటే అకౌంటింగ్‌పై మంచి అవగాహన, గణితం, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, పన్నుల చట్టాలు, ఆడిటింగ్‌పై ఆసక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, వివరాలపై శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు సీఏ కోర్సులు చేరుతున్నా కఠినమైన పరీక్షలు, ఆర్టికిల్‌షిప్‌ కారణంగా కొద్ది మంది మాత్రమే సీఏలుగా అర్హత పొందుతున్నారు. సాధారణంగా ఏటా 20వేల నుంచి 30వేల మంది కొత్త సీఏలుగా వృత్తిలోకి వస్తున్నారు.


సీఏ డే ఉత్సవం

ఐసీఏఐ వరంగల్‌ బ్రాంచ్‌లో మంగళవారం సీఏ డేను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వరంగల్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ సుజిత్‌ తెలిపారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. పరకాల మండలం రాయపర్తిలోని జడ్పీ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేస్తారు. సాయంత్రం సీఏలు, వారి కుటుంబ సభ్యుల వినోద కార్యక్రమాలు ఉంటాయి.


సీఏకు మంచి భవిష్యత్‌..

సీఏ వృత్తికి మంచి భవిష్యత్‌ ఉంది. ముఖ్యంగా వరంగల్‌ వంటి నగరాల్లో సీఏలకు డిమాండ్‌ పెరుగుతోంది. భవిష్యత్‌లో ఈ రంగంలో అవకాశాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫారెన్సిక్‌ అకౌంటింగ్‌, ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, డాటా అనలిటిక్స్‌ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పుడిప్పుడే ఎక్కువ మంది సీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది శుభపరిణామం. భవిష్యత్‌లో హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయికి ఎదగనున్న వరంగల్‌ నగరంలో సీఏల అవసరం ఎంతగానో ఉంటుంది.

  • త్రిపురనేని గోపీచంద్‌, సీనియర్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఆల్‌ ఇండియా కమిటీ ఫర్‌ మెంబర్స్‌ ఇన్‌ ప్రాక్టీస్‌ కోఆప్టెడ్‌ సభ్యుడు


ఈ వార్తలు కూడా చదవండి:

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 01:04 PM