Share News

కొంగు నడుముకు చుట్టి.. కొడవలి చేతపట్టి...

ABN , Publish Date - Sep 10 , 2026 | 10:38 AM

భూస్వాముల ఆగడాలపై తిరబడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అలియాస్‌ చాకలి ఐలమ్మ.

కొంగు నడుముకు చుట్టి.. కొడవలి చేతపట్టి...
Chakali Ailamma

  • దొరల ఆధిపత్యంపై తిరగబడిన వీరనారి

  • భూమి కోసం మడమ తిప్పని పోరాటం

  • అండగా నిలిచిన ఆంధ్ర మహాసభ

  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే స్ఫూర్తి

  • నేడు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి

పాలకుర్తి(జనగామ): భూస్వాముల ఆగడాలపై తిరబడిన వీరనారి చిట్యాల ఐలమ్మ అలియాస్‌ చాకలి ఐలమ్మ. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టపురంలో జన్మించిన ఐలమ్మ, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి కోడలుగా వచ్చింది. చిట్యాల సాయమ్మ, లచ్చయ్య దంపతులకు ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నర్సయ్యతో ఐలమ్మకు వివాహమైంది. ఉమ్మడి కుటుంబం కావడం, కుల వృత్తి(చాకలి) చేసుకుని జీవించడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో వ్యవసాయం చేయాలని భావించారు. మల్లంపల్లికి చెందిన మక్తేదారు కొండల్‌రావుకు చెందిన భూమి కౌలుకు తీసుకొంది. ఐలమ్మకు కొండల్‌రావు తల్లి జయప్రదదేవి కౌలుకిచ్చింది. తర్వాతి కాలంలో భూస్వాముల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో పోలీస్‌ పటేల్‌ వీరమనేని శేషగిరిరావుతో ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది.


ఐలమ్మ భూమిలోకి వెళ్లాలంటే పోలీస్‌ పటేల్‌ భూముల్లోంచే వెళ్లాలి. దారి లేదు. ముందుగా తన పొలంలో పనిచేశాకే తర్వాత మీ భూముల్లో పని చేసుకోవాలని శేషగిరిరావు ఆదేశించాడు. దాన్ని ధిక్కరించి ఐలమ్మ పంట సాగుచేసింది. ఇదే సమయంలో దొరలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు చూసి కమ్యూనిస్టు పార్టీలో ఐలమ్మ కుటుంబం చేరిం ది. పార్టీలో ఐలమ్మ చురుగ్గా పాల్గొనేది. ఇది చూసిన శేషగిరిరావు విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డికి ఐలమ్మపై ఫిర్యాదు చేశాడు. ఐలమ్మ వల్ల పాలకుర్తిలో ఉద్యమం బలపడుతుందని, స్థానికులైన జీడి సోమనర్సయ్య లాంటి యువకులు దొరలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలిపాడు. దీంతో ఐలమ్మను, పార్టీని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు చేశారు.


పాలకుర్తిలో 1945లో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా సభను పెట్టాలని నిర్ణయించారు. తమ ఆధిపత్యానికి గండి పడుతుందని గ్రహించిన దేశ్‌ముఖ్‌ గూండాలను పురమాయించాడు. పాలకుర్తిలో సభ ప్రారంభం కాగానే దేశ్‌ముఖ్‌ గూండాలు అల్లరి సృష్టించారు. ఆరుట్లపై దాడికి దిగేలోపే ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఆ గూండాలపై ప్రతిదాడికి దిగి వారిని తరిమికొట్టారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆరుట్లను మారువేశంలో వావిలాలకు తరలించారు. తమ అనుచరులను చంపే ప్రయత్నం చేశారని దేశ్‌ముఖ్‌ కుట్ర చేసి కేసు పెట్టించాడు. నాయకుల్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.


ఈ నేపథ్యంలోనే ఐలమ్మ పండిస్తున్న భూమిని, పంటను కాజేయాలని దేశ్‌ముఖ్‌ తప్పుడు పత్రాలు సృష్టించి ఐలమ్మ భూమి తనదేనని బెదిరించాడు. అప్పటికే ఐలమ్మ భర్త నర్సయ్య, కొడుకులు సోమ య్య, లచ్చయ్యలు కుట్ర కేసులో జైల్లో ఉన్నారు. ఒం టరిగా ఉన్న ఐలమ్మను దెబ్బతీస్తే అటు ఐలమ్మ కుటుంబం ఇటు కమ్యూనిస్టు ఉద్యమం దెబ్బతింటుందని భూస్వాములు ఎత్తులు వేశారు. అయినా ఐలమ్మ ధైర్యంతో కమ్యూనిస్టు నాయకుల్ని కలిసింది. తమభూమి సంబంధించిన వివాదాన్ని చెప్పింది.


hnk1.jpgనల్లగొండ జిల్లా నాయకత్వం సీరియస్‌ తీసుకొని భూమి రక్షించేందుకు ప్రణాళిక రూపొందించారు. పాలకుర్తికి వచ్చి ఐలమ్మకు, పార్టీకి రక్షణగా అగ్రనాయకత్వం నిలిచింది. పాలకుర్తి ఆర్గనైజర్‌ చకిలం యాదగిరిరావు, జిల్లా పార్టీ కార్యదర్శి దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, బీంరెడ్డి నర్సింహరెడ్డి, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డిలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, వలంటీర్లు పాలకుర్తికి చేరుకున్నారు. ఐలమ్మ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చారు. దేశ్‌ముఖ్‌ ఎత్తుగడలను పసిగడుతూ వచ్చారు. 1945 నవంబరు నెలలో ఐలమ్మ భూమిలో పండిన ధాన్యాన్ని దోచుకురమ్మని గూండాలు పాలకుర్తికి పంపాడు. భూమిలో అడుగుపెట్టిన ఆ గూండాలను ఆంధ్ర మహాసభ నాయకత్వం సమిష్టిగా ఎదుర్కొంది. వారిని తరిమివేసి పంటను కోసి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు.


పారిపోయిన గుండాలు దేశ్‌ముఖ్‌కు విషయం చెప్పటంతో పోలీసులను పంపించి నాయకుల్ని అరె స్ట్‌ చేయించాడు. తర్వాత పాలకుర్తి గ్రామంపై దాడులు చేయించడమేకాక, ఐలమ్మ ఇంటి దోచారు. కార్యకర్తల ఇండ్లకు నిప్పు పెట్టారు. ఐలమ్మ ఇల్లే కేంద్రంగా ఉద్యమ విస్తరణ జరిగింది. ఐలమ్మ కొడుకులు దళ కమాండర్‌లుగా ఎదిగారు. ఐలమ్మ భూపోరాటంతో సాయుధ పోరాటం జరిగింది. వేలాది ఎకరాలు భూములు ప్రజలకు పంచబడి గ్రామ స్వరాజ్యలేర్పడ్డాయి. ఐలమ్మ ఉద్యమానికి కొండంత అండగా నిలబడి చర్రితలో కమ్యూనిస్టు ఐలమ్మగా నిలిచిపోయింది.


ఐలమ్మ వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయస్సులో 1985 సెప్టెంబరు 10న కన్నుమూసింది. ఆమె మరణాంతరం పాలకుర్తిలో స్మారక భవనం, స్మారక స్తూపం నిర్మించబడ్డాయి. 2015లో ఐలమ్మ కాంస్య విగ్రహా న్ని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా ఆవిష్కరించాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 10:38 AM