Share News

ఒక్క మాట.. జీవితానికి భరోసా

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:47 AM

ఒక్క క్షణం చాలు మన మనసు మార్చుకోవడానికైనా, అవతలి వ్యక్తి మనసు మార్చడానికైనా!

ఒక్క మాట.. జీవితానికి భరోసా
World Suicide Prevention Day

  • ఆత్మీయ పలకరింపుతో గుండె బాధలు తగ్గుదల

  • చనిపోవాలనుకున్న వారికి బతుకునిచ్చే తారక మంత్రం

  • నేటి బిజీ జీవితంలో పలు సమస్యల్లో ప్రజలు.. నేనున్నా అనేవారే కరువు

  • ఈ నేపథ్యంలో అందుబాటులో పలు హెల్ప్‌లైన్‌ సెంటర్లు

  • నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

హైదరాబాద్‌ సిటీ: ఒక్క క్షణం చాలు మన మనసు మార్చుకోవడానికైనా, అవతలి వ్యక్తి మనసు మార్చడానికైనా! మనం బతకడానికైనా, మరొకరిని చావు ఆలోచనల నుంచి తప్పించడానికైనా! ఎంతసేపూ నేనూ నాదీ అని గిరిగీసుకొని బతకడమేనా! అప్పుడప్పుడు పక్క మనిషి గుండె లోతుల్ని తెలుసుకోవడం కూడా అవసరం.


దిగాలుగా ఉంటే..

స్నేహితుడు, సహోద్యోగి, పక్కింటి వాళ్లు, పరిచయస్తులు.. ఎవరైతేనేం! రోజూ నవ్వుతూ సరదాగా ఉండే వ్యక్తి దిగాలుగా కనిపించినప్పుడు.. మాట కలపండి! ‘ఎలా ఉన్నావ్‌!’ అని అడగండి. ‘ఏం ఫర్వాలేదు.. నేనున్నా’ అని భరోసా ఇవ్వండి. ఆ సయయంలో మీ పలకరింపే ఓ నూరేళ్ల జీవితాన్ని నిలబెట్టచ్చు. చనిపోవాలన్న ఆలోచన నుంచి వారిని బయటకు తీసుకువచ్చే తారకమంత్రం అవ్వచ్చు. సెప్టెంబరు 10, ఆత్మహత్యల నివారణా దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే పిలుపు ఇచ్చింది.


మీ బాధ వింటారు!

మనసులో బాధను తెలిసిన వారికి చెప్పుకుంటే తమను చులకనగా చూస్తారని అలాగే ఉండిపోతారు. ఇలాంటి వారికి బాధలు పంచుకోడానికి కొన్ని హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉన్నాయి. తమ గోడు కౌన్సెలర్లతో పంచుకోవచ్చు. వివరాలను గోప్యంగా ఉంచుతారు. హెల్ప్‌లైన్లు నెంబర్లు ఇవే.. రోష్ని 81420 20033, 81420 20044, 040 6620 2000, 040 6620 2001( ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9గంటల వరకు). సేవ 040 27504682, 94417 78290 (ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు). కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహణలోని టెలిమానస్‌ ఉచిత హెల్ప్‌లైన్లు 14416, 1800 891 4416, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కిరణ్‌ హెల్ప్‌లైన్‌ 1800 599 0019(24గంటలు) ద్వారా మానసిక నిపుణులను సంప్రదించవచ్చు.


city5.jpgఇంపల్సివ్‌ బిహేవియర్‌తో..

ఎక్కువ శాతం మానసిక రుగ్మతలు, డిప్రెషన్‌ వల్ల ఆత్మహత్య ప్రయత్నాలకు ఒడిగట్టేవారి ప్రవర్తన, మాటల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. అయితే ఇంపల్సివ్‌ బిహేవియర్‌తో బలవన్మరణానికి పాల్పడే వ్యక్తులను గుర్తించడమే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని సీనియర్‌ సైకియాట్రిస్టు పింగళి శ్రీలక్ష్మి చెబుతున్నారు. ‘నా మాటే నెగ్గాలి’, ‘నలుగురి ముందు నన్ను అవమానించారు’, ‘నేను అనుకున్నదే జరగాలి’.. ఈ రకమైన ధోరణితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు ఎక్కువమంది ఉంటున్నారు.


యువతే అధికం..

ఆత్మహత్య ఆలోచనలకు వ్యతిరేకంగా సేవలందిస్తున్న హెల్ప్‌లైన్లను సంప్రదిస్తున్న వారిలో 70నుంచి75 శాతం యువత ఉండడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు, వైవిహిక జీవితంలో తగాదాలు, అనుబంధాల్లో అపశ్రుతులు సమస్యలేవైతేనేం... రోష్ని స్వచ్ఛంద సంస్థ హెల్ప్‌లైన్‌కు పోయిన ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 5,610 కాల్స్‌ వచ్చాయి. అందులో 18నుంచి 30ఏళ్లలోపు వారు 2,537మంది, 31నుంచి45ఏళ్లలోపు వారు 1550 మంది,


18ఏళ్లకంటే తక్కువ వారు 225మంది ఉన్నట్లు రోష్ని కౌన్సెలర్‌ రత్న తెలిపారు. మొత్తం కాల్స్‌లో అత్యధికంగా 1,733 మంది ప్రేమ, సహజీవనం తదితర సమస్యల కారణంగా జీవితాన్ని చాలించాల నుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వెయ్యికుపైగా కాల్స్‌ ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా లోన్‌యాప్స్‌ బాధితుల నుంచి వచ్చాయంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు తమ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌లో 75శాతం 21నుంచి 40ఏళ్లలోపు వారినుంచే ఉన్నాయని ఆ సంస్థ ట్రస్టీ శాంతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 09:47 AM