Share News

ఆయుధాల చోరీలో ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:51 AM

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొల్లారంలోని (సికింద్రాబాద్‌), 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ ఆయుధాల చోరీ కేసులో.. ముగ్గురు సీనియర్‌ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంతకుముందే నలుగురు గార్డులను (అగ్నివీర్‌) విచారించగా.. వారిచ్చిన సమాచారంతో కేసు దర్యాప్తులో 10 రోజుల తర్వాత కీలక ముందడుగు పడింది.

ఆయుధాల చోరీలో ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్‌
army theft

  • ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ

  • రంగంలోకి డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌, మిలిటరీ పోలీస్‌

  • అనుమానితుల నుంచి కీలక సమాచారం సేకరణ

  • వర్షం కురిసిన రాత్రి తాళాలు పగులగొట్టి తప్పుదోవ పట్టించే డ్రామా

  • 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధ చోరీ కేసులో కీలక పురోగతి

హైదరాబాద్‌ సిటీ/బోయిన్‌పల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బొల్లారంలోని (సికింద్రాబాద్‌), 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ ఆయుధాల చోరీ కేసులో.. ముగ్గురు సీనియర్‌ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంతకుముందే నలుగురు గార్డులను (అగ్నివీర్‌) విచారించగా.. వారిచ్చిన సమాచారంతో కేసు దర్యాప్తులో 10 రోజుల తర్వాత కీలక ముందడుగు పడింది. తాజాగా ముగ్గురు సీనియర్‌ అధికారులకు అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. ఆర్మీ రెజిమెంట్‌ శిక్షణా కేంద్రంలో వినియోగించే ఆయుధాలు, బుల్లెట్లకు ఎలాంటి ప్రత్యేక కోడింగ్‌ నంబర్లు ఉండవు. ఈ విషయాన్ని పసిగట్టిన నిందితులు, పక్కా ప్రణాళిక మేరకు వాటిని విడతల వారీ చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఆర్మీ సీనియర్‌ అధికారులు స్వయంగా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారా? లేక అగ్నివీర్లపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా చోరీ చేయించారా? అనే దిశగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆయుధాల చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, గత మూడు నెలలుగా పక్కా వ్యూహంతో ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అత్యాధునిక ఆయుధాలైన ఏకే-203 రైఫిల్స్‌, ఇన్సాస్‌ రైఫిల్స్‌, పిస్టల్స్‌ సహా 12 ఆయుధాలను పలు దఫాలుగా బయటకు తరలించారు. ఆయుధాగారం (కోట్‌) వద్ద ప్రతిరోజు రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకుకు సీసీ కెమెరాలను ఆపివేసి.. డ్యూటీలో ఉన్న గార్డులను వేర్వేరు పనుల పేరుతో బయటకు పంపేవారు. రెజిమెంట్‌లో ఏదో ఒక హడావిడి జరుగుతున్నట్లు సీన్‌ క్రియేట్‌ చేసి, ఆయుధాలను తరలించినట్లు తెలిసింది. ఆయుధాల చోరీ వెలుగు చూడడంతో డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌, మిలిటరీ పోలీస్‌ తదితర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. సుమారు 12 అత్యాధునిక ఆయుధాలు, దాదాపు 2వేల రౌండ్‌ బుల్లెట్లను (సుమారు ఒక క్వింటా బరువు) ఎవరికోసం దొంగిలించారు? ఎక్కడికి తరలించారు? ఈ వ్యవహారం వెనుక సంఘ విద్రోహ లేదా ఉగ్రవాద శక్తుల హస్తం ఉందా? తదితర కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన ఆర్మీ అధికారుల కాల్‌ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు.


దొంగల పనిగా చిత్రీకరించేందుకు..

బయటి దొంగలు చేసిన పనిగా చిత్రీకరించేందుకు, పక్కదారి పట్టించేందుకు నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు రాత్రి (గత నెల 30న) కురిసిన వర్షాన్ని ఆసరాగా తీసుకుని.. ఆయుఽధాగారం, లోపలున్న ఆయుధాల బాక్స్‌ల తాళాలు పగులగొట్టి దొంగతనం నాటకం ఆడారు. కాగా, కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ క్యాంప్‌సలో ఇలాంటి లోపాలు వెలుగుచూడడాన్ని ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడమా?

స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుల దురహంకార వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 07:51 AM