Share News

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:57 AM

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-సర్‌ ప్రక్రియలో భాగంగా అనామలిస్‌ జాబితా, ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లున్నా... వివరాలు సరిగా లేకపోవడం, గుర్తింపు పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు
ECI

ఓటర్లకు ఎన్నికల సంఘం వెసులుబాటు

ఆన్‌లైన్‌లోనూ రిప్లై ఇచ్చే అవకాశం..

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-సర్‌ ప్రక్రియలో భాగంగా అనామలిస్‌ జాబితా, ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లున్నా... వివరాలు సరిగా లేకపోవడం, గుర్తింపు పత్రాలు సమర్పించకపోవడం వంటి కారణాలతో ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిని బీఎల్‌వోలు నేరుగా ఓటరు ఇంటికొచ్చి ఇవ్వాల్సి ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్లకు జారీ చేసే సర్‌ నోటీసులను వెబ్‌సైట్‌లో ఉంచాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. దీని ప్రకారం ‘సీఈవోతెలంగాణ.ఎన్‌ఐసీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో ఆ నోటీసులను ఉంచారు. అయితే ఈ నోటీసులను ఎలా చూసుకోవాలన్న దానిపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి.. ఎన్నికల విభాగాలు చెబుతున్న ప్రకారం ఓటర్లు ముందుగా ఈసీఐ అధికారిక పోర్టల్‌, లేదంటే.. ‘సీఈవోతెలంగాణ.ఎన్‌ఐసీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో తమకు వచ్చిన నోటీసును చూడొచ్చు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే.. అసెంబ్లీ నియోజకవర్గం, దాని పరిధిలో సదరు ఓటరు నివసించే ప్రాంతానికి సంబందించిన పోలింగ్‌ స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉటుంది. అందులో సర్‌ నోటీసులకు సంబంధించిన ఆప్షన్‌ తీసుకోవాలి. అది ఓపెన్‌ కాగానే.. ఇప్పటికే ఓటరుగా నమోదై ఉంటే ఎపిక్‌ కార్డు నంబర్‌ ఆధారంగా చూసుకోవచ్చు. సదరు ఓటరు పేరిట నోటీసు జారీ అయి ఉంటే.. అందులో నోటీసు ఇవ్వడానికి కారణం.. విచారణ తేదీ.. సంబంధిత ఈఆర్‌వో, ఏఈఆర్‌వో వివరాలతో పాటు బీఎల్‌వోకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుందని.. దాన్ని పరిశీలించుకొని తగిన ఆధారాలు సమర్పించాలి. అలాగే ఈసీఐ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అనామలిస్‌ జాబితాను సైతం పొందుపర్చారు ఇందులో.. ఎవరికి ఏ తేడాలున్నాయో... వివరాలిచ్చారు.. దాని ప్రకారం తమకు నోటీసు వస్తుందా..? లేదా కూడా తెలుసుకోవచ్చు. నోటీసు వచ్చిన ప్రతి ఓటరు దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో నోటీసు కనిపించకపోయినా, స్థానిక బీఎల్‌వో వద్ద... నియోజకవర్గం ఈఆర్‌వో, ఏఈఆర్‌వోల దగ్గర వివరాలు తెలుసుకోవచ్చు.


నోటీసుకు రిప్లై ఎలా ఇవ్వాలి..?

నోటీసులో పేర్కొన్న కారణాన్ని ముందుగా పూర్తిగా చదవాలి. ఆ తర్వాత తమ ఓటరు వివరాలు సరైనవేనని నిరూపించే ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. ఓటరు అందించే వివరణలో ముఖ్యంగా పేరు, ఎపిక్‌ కార్డు (ఓటరు కార్డు) నంబర్‌, ప్రస్తుత చిరునామా, మొబైల్‌ నంబర్‌, ఇతర వ్యక్తిగత వివరాలు పేర్కొనాలి. అలాగే ఆధార్‌ వంటి గుర్తింపు, చిరునామా ఆధారాలు, పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలి. పాత ఓటరు జాబితా వివరాలు ఉంటే వాటి ప్రతులు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు అవసరమైతే వాటి ఆధారాలనూ సమర్పించాలి. ఈసీఐ పోర్టల్‌ వెబ్‌సైట్‌లో నోటీసును గుర్తిస్తే.. ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు, పత్రాలు సమర్పించేందుకు వీలు కల్పించారు. వెబ్‌సైట్‌లోనే కాకుండా.. ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌లో కూడా నోటీసులో పేర్కొన్న వివరాల ఆధారంగా ఓటరు తమ ఆధారాలను అప్‌లోడ్‌ చేయొచ్చు. అయితే ఆన్‌లైన్‌ నమోదు చేసిన ఆధారాలకు సంబంధించిన జిరాక్సు కాపీలను సంబంధిత బీఎల్‌వోలకు అందజేస్తే మంచిదని.. ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సందర్భంలో పూర్తిగా అప్‌లోడ్‌ కాకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఎన్నికల విభాగాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

హ్యామ్‌ రోడ్లకు హడ్కో రుణం
1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్‌ రైల్‌ పనుల వేగవంతం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:57 AM