హ్యామ్ రోడ్లకు హడ్కో రుణం
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:29 AM
ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) రోడ్ల పనుల కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
టీజీఆర్డీసీ ఎండీకి లేఖ పంపిన హడ్కో
9.12 శాతం వడ్డీతో 17.5 ఏళ్లలో చెల్లింపు
ఫలించిన మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నాలు
హడ్కో ఉన్నతాధికారులతో నేడు భేటీ
హ్యామ్ పరిధిలో లేని మరో 9 వేల కోట్ల
పనులకూ హడ్కో నుంచే రుణం
తీసుకోవాలని సర్కారు యోచన
రూ.9,161కోట్లు ఇచ్చేందుకు ఓకే
ఫలించిన మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నం
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) రోడ్ల పనుల కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హ్యామ్ రోడ్ల పనుల కోసం రూ.9,161 కోట్లను తెలంగాణ రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీజీఆర్డీసీ)కు రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీజీ ఆర్డీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు మంగళవారం రాత్రి హడ్కో లేఖ రాసింది. 9.12శాతం వడ్డీతో మంజూరు చేయనున్న రుణాన్ని పదిహేడున్నరేళ్లలో తిరిగి చెల్లించేందు(రీపేమెంట్)కు అవకాశం కల్పించింది. హ్యామ్ విధానంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం తరపున 40 శాతం నిధులను ముందుగానే ఇవ్వాలన్నది నిబంధన. అందులో భాగంగానే నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ గ్యారెంటీతో టీజీఆర్డీసీకి రుణం ఇచ్చేందుకు హడ్కో అనుమతి తెలిపింది. ఈ నిధులను నేరుగా ఆర్డీసీ ఖాతాకు బదిలీ చేయనుంది. ఈ నేపథ్యంలో హడ్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జోనల్ జనరల్ మేనేజర్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో 34 ప్యాకేజీల్లో 6,092.37 కిలోమీటర్ల మేర 441 రహదారులను హ్యామ్ కింద నిర్మించను న్నారు. నల్లగొండ జిల్లా కనగల్‌లో జూన్ 28న హ్యామ్ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 40శాతం వాటా నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని అప్పుడే మంత్రి కోమటిరెడ్డికి సూచించారు. ఈ మేరకు హడ్కోను సంప్రదించగా... ఆమోదం లభించింది. ప్రభుత్వం తన వాటా కింద 40 శాతం ఇస్తే.. మిగిలిన 60 శాతం నిధులను పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఆ నిధులను 15 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా ఆర్బీఐ నుంచి గ్యారెంటీ ఇస్తోంది. ఇదిలా ఉండగా, హ్యామ్ రోడ్ల జాబితాలో లేని రోడ్ల పనుల కోసమూ హడ్కో నుంచే రుణం తీసుకోవాలనే యోచనలో ఆర్ అండ్ బీ ఉన్నట్టు తెలిసింది. ప్లాన్ వర్క్స్ కింద రూ.9వేల కోట్ల పనులు ఉన్నాయని అధికారులు మంత్రి కోమటిరెడ్డికి నివేదిక ఇచ్చారు. హ్యామ్ రోడ్ల కోసం రుణం ఇచ్చిన నేపథ్యంలో ప్లాన్ వర్క్స్ కోసమూ మరో 9వేలకోట్లను హడ్కో నుంచే రుణంగా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. హడ్కో అధికారులతో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
వచ్చే వారం క్యాబినెట్ ముందుకు రెండు ఫైళ్లు
హ్యామ్ పనుల కోసం రూ.9,161కోట్లు, ప్లాన్ వర్క్స్ కోసం మరో రూ.9వేల కోట్ల రుణాలకు సంబంధించిన ఫైళ్లు క్యాబినెట్ ముందుకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత.. వచ్చే వారంలో మంత్రివర్గ సమావేశం ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆర్ అండ్ బీ కి సంబంధించిన ఫైళ్లనూ సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఘట్‌కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైన్
టీవీ9 షేర్ల బదిలీ కేసులో రవి ప్రకాశ్‌కు నిరాశ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News