Share News

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:44 AM

జిల్లాలో ఆదివారం గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శ్రీకాకుళంలో 8, ఎచ్చెర్లలో 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

		  ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్షలు
శ్రీకాకుళంలో అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు

- ఉదయం 820 మంది, మధ్యాహ్నం 831 మంది గైర్హాజరు

అరసవల్లి/ఎచ్చెర్ల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శ్రీకాకుళంలో 8, ఎచ్చెర్లలో 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. మొత్తం 5,535 మంది అభ్యర్థులకు గాను ఉదయం 4,715 మంది హాజరుకాగా, 820 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 4,704 హాజరుకాగా, 831 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 91శాతం అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకున్నారు. ఈ కేంద్రాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించి హాల్‌ టికెట్‌, గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు. ఎటువంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించలేదు. అంబేడ్కర్‌ వర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో జరిగిన పరీక్షకు హాజరైన శ్రీకాకుళం నగరానికి చెందిన కె.అనూష అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఎచ్చెర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.ఉషశ్రీ, హెల్త్‌ అసిస్టెంట్‌ చిన్నవాడు చికిత్స అందించారు. అనంతరం అనూష పరీక్ష రాసింది. ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఓ దివ్యాంగునికి సహకరించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు.

Updated Date - Feb 24 , 2025 | 12:44 AM