Share News

తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!

ABN , Publish Date - Feb 13 , 2026 | 09:13 AM

తెలంగాణలో మున్సిపల్ కౌంటింగ్‌కు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్‌లో క్యాంప్ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది. అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్: వరంగల్, నిజామాబాద్‌లలో క్యాంప్ పాలిటిక్స్ హీట్!
Telangana Municipal Elections

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) ఫలితాల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న క్యాంప్ రాజకీయాలు(Camp Politics) రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే, అభ్యర్థులు చేజారిపోకుండా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వెలువడక ముందే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలిస్తూ రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపారు.


ఉమ్మడి వరంగల్ జిల్లా.. రాత్రికి రాత్రే క్యాంపులకు తరలింపు..

వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట, మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను రాత్రికి రాత్రే ప్రత్యేక వాహనాల్లో రహస్య ప్రాంతాలకు తరలించారు. అభ్యర్థులు నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా, వారి తరఫున నమ్మకమైన ఏజెంట్లను మాత్రమే పంపారు. ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులను తమ అదుపులో ఉంచుకునేందుకు ఈ ఏర్పాటు చేశారు.


నిజామాబాద్ కార్పొరేషన్.. 'మ్యాజిక్ ఫిగర్' కోసం హైడ్రామా..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంది. నిజామాబాద్‌లోని 60 డివిజన్లలో 58 చోట్ల పోటీ చేసిన బీఆర్ఎస్, తమ అభ్యర్థులను ముందు జాగ్రత్తగా ప్రత్యేక బస్సులో హైదరాబాద్ క్యాంపునకు తరలించింది. ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండటమే వీరి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, హంగ్ ఏర్పడితే ఎంఐఎం మద్దతు కీలకం కానుంది.


కాంగ్రెస్ పార్టీ అలర్ట్': రిసార్టుల బుకింగ్

అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. నగర శివారులోని పలు రిసార్టులలో ఏకంగా 350 గదులను కాంగ్రెస్ నేతలు బుక్ చేశారు. నిన్న(గురువారం) రాత్రి, ఈరోజు(శుక్రవారం) ఉదయం విడతల వారీగా అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఇతర పార్టీలు 'ఆకర్ష్' మంత్రం వేయకుండా హస్తం నేతలు గట్టి నిఘా ఉంచారు. మున్సిపల్ ఛైర్మన్, మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి అవసరమైన 'మ్యాజిక్ ఫిగర్' రాకపోతే, స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతు తప్పనిసరి కానుంది. ఈ తరుణంలో అభ్యర్థులు చేజారకుండా ఆయా పార్టీలు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 09:57 AM