ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..
ABN , Publish Date - May 19 , 2026 | 01:39 PM
మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.
కొనుగోలు కేంద్రాల కేటాయింపులో మహిళల పట్ల చిన్నచూపు
స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం కరువు
10 శాతానికే పరిమితం చేసిన వైనం
బినామీలతో కొనసాగుతున్న కొన్ని సెంటర్లు!
భూపాలపల్లి: మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. కొనుగోలు కేంద్రాల కేటాయింపే ఇందుకు నిదర్శనం. కొన్ని కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినా నిర్వహణ మాత్రం పురుషుల చేతుల్లోనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మహిళలకు 10 శాతానికే పరిమితం చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
జయంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొను గోలు కేంద్రాల్లో కేవలం 10శాతం.. అంటే 20 మహిళా సంఘాలకు మాత్రమే అవకాశం కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పైగా ఇందులో కొన్ని కేంద్రాలను బినామీ పేర్లతో పురుషులే నడిపిస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన 180 కేంద్రాలను పురుషులకే అధికారికంగా అప్పగించారు.
కొనుగోలు చేయలేని కేంద్రాల అప్పగింత
పట్టుమని రోజుకు 10 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరగని ప్రాంతంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదే పురుషులకైతే ఆంక్షలు లేని, విరివిగా ధాన్యం వచ్చే కేంద్రాలను అప్పగించారు. దీంతో మహిళలకు తక్కువ, పురుషులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇలా తమ పట్ల సర్కారు ఇదేం చిన్నచూపని మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బినామీల హవా...
మహిళల పేరుతో కేంద్రాలు కేటాయించినా... కొన్ని చోట్ల బినామీలుగా పురుషులే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తీర్మానాలు మహిళా సంఘాలు చేస్తుండగా క్షేత్రస్థాయిలో పెత్తనమంతా పురుషులదేనని మహిళా సంఘాల నాయకులు తెలిపారు. టెండర్లు, బిల్లులు, లావాదేవీలు అన్నీ పురుషులే చూసుకుంటూ.. మహిళలను కేవలం పేరుకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళా కొనుగోలులో ఏవైనా అవకతవకలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లితే.. ఆ నష్టం మహిళలే భరించాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో విచారణ జరిపి మహిళలకే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పలు సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఇదేం న్యాయం?
జిల్లాలోని 200 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళలకు 50శాతం కేటాయించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వారిని 10శాతానికే పరిమితం చేసినట్లు లెక్కలు చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ కూడా మహిళా సంఘాలు నడిపే కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, లారీలు సకాలంలో రాకపోవడం, ధాన్యం పెద్దగా రైతులు తీసుకురాకపోవడం వంటి సమస్యలు అనేకం చోటుచేసుకుంటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే పురుషులు నడిపే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం అన్ని సౌకర్యంగా ఉంటున్నాయని అంటున్నారు. పైగా మరో పదిశాతం కేంద్రాలను అధికార పార్టీకి చెందిన నాయకులే కైవసం చేసుకుని ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. పొరుగు జిల్లాల్లో సగానికి సగం మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వగా, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగే అవకతవకలు, పురుషుల బినామీ ఆధిపత్యంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
బినామీ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు. బిల్లుల చె ల్లింపులో నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లోకి వేయాలని, కేంద్రాల ని ర్వహణలో పూర్తిగా మహిళా సంఘాల సభ్యులకే అప్పగించాలని కోరు తున్నారు. 50శాతం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిడ్డా.. నువ్వు గొప్పోడివి కావాల
తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News