Share News

బిడ్డా.. నువ్వు గొప్పోడివి కావాల

ABN , Publish Date - May 19 , 2026 | 11:56 AM

ఏడాది కాలంలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భేష్‌ అనిపించుకున్నాడు నాగులగుడ్డంతండా గ్రామానికి చెందిన హరీష్‌ నాయక్‌.

బిడ్డా.. నువ్వు గొప్పోడివి కావాల
Six Government Jobs

  • అమ్మమాటే బాటగా చదువు

  • గిరిపుత్రుడిని వరించిన ఆరు ఉద్యోగాలు

  • నాగులగుడ్డంతండా యువకుడి విజయగాథ

శింగనమల(అనంతపురం): ఏడాది కాలంలోనే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భేష్‌ అనిపించుకున్నాడు నాగులగుడ్డంతండా గ్రామానికి చెందిన హరీష్‌ నాయక్‌. పేద గిరిజన కుటుంబానికి చెందిన ఈయన తల్లి ప్రోత్సాహంతో చదువులో ముందుకు సాగినట్లు తెలిపారు. దివ్యాంగుడు నాగులునాయక్‌, జానకమ్మబాయి కుమారుడైన హరీష్‌ నాయక్‌ పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదివించడం అవసరమా అని బంధువులు కూడా అతడి తల్లిని హేళన చేశారు. ఇలాంటి ఘటనలతో కుంగిపోయిన హరీ్‌షనాయక్‌ను ‘బిడ్డా నువ్వు గొప్పోడివి కావాల. అప్పుడే అందరూ గౌరవిస్తారు. మర్యాద ఇస్తారు. ఇందుకు నీకు చదువే మార్గం. బాగా చదువుకుని ప్రయోజకుడివి కావాల’ అంటూ తల్లి ఊరడిస్తూ ప్రోత్సహించింది. స్వగ్రామంలోనే ఐదో తరగతి వరకు చదివాడు. ఆరు నుంచి ఇంటర్‌ వరకు శింగనమల, అనంతపురం ఎస్‌ఎస్బీఎన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు.


ఉద్యోగ వేటలో..

డిగ్రీ పూర్తయిన తర్వాత అనంతపురంలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో రెండేళ్ల పాటు బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్నాడు. ఇంటికి దూరంగా నగరంలోనే ఉంటూ బ్యాంకు ఉద్యోగ సాధన కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈక్రమంలోనే గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో బ్యాంకు ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. రాసిన అన్ని పరీక్షల్లో ప్రతిభ చూపడంతో బ్యాంకు ఉద్యోగాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎస్‌బీఐ జానియర్‌ అసిస్టెంట్‌, ఐబీపీఎస్‌ క్లర్కు, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌, ఐడీబీఐ ఈఎ్‌సవో, ఐడీబీఐ జామ్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించాడు. చివరగా ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించాడు. దీంతో రాజంపేట ఎస్‌బీఐలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్‌ఐసీలో ఏఏవోగా చేరనున్నట్లు తెలిపాడు.


అమ్మ కన్నీళ్లు తుడవాలనే..: హరీష్‌ నాయక్‌

మాది పేద కుటుంబం. కూలి పనికి పోతేకానీ పొట్టగడవదు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ జానకమ్మబాయి నన్ను చదివించింది. మా బంధువుల్లో కొందరు ‘ఎందుకమ్మా చదువు? ఏం వాడు చదువుకొని ఉద్యోగం సాధిస్తాడా ఏమైనా? చదివిస్తే ఉద్యోగం రాక, కూలి పని చేయలేక ఎటూ కాకుండా పోతాడు. నీవెంట కూలిపనికి తీసుకుపోతే కాసిన్ని డబ్బులైనా సంపాదిస్తాడు’ అంటూ అమ్మకు తరచూ నూరిపోసేవారు. అయినా అమ్మ వారి మాటలు పట్టించుకోకుండా, నాపై నమ్మకంతో ఓ పూట తినీ తినక నన్ను చదివించింది. ఆఫలితమే నేటి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవన్నీ ఆమె ఆశీర్వాదాలే.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నాలుగు రోజుల్లో రెండోసారి..

తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 19 , 2026 | 11:59 AM