విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు.. ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - May 19 , 2026 | 12:48 PM
మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు డీఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
చెన్నై, మే 19: మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడులో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్లు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చని అన్నారు. ముందస్తు ఎన్నికలకు డీఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా సెక్రటరీలతో ఎంకే స్టాలిన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
డీఎంకేలోని సీనియర్ నేతలు కూడా విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని అంటున్నారు. ఆదివారం డీఎంకే పార్టీ సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వం నాలుగు లేదా ఆరు నెలల్లో కుప్పకూలుతుందని అన్నారు. మళ్లీ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
ఎప్పుడు.. ఏమైనా జరగొచ్చు..
2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచింది. విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించటంతో.. ఓ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 107 మాత్రమే. వీసీకే, సీపీఐ, సీపీఎమ్, ఐయూఎమ్ఎల్, కాంగ్రెస్ మద్దతుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కి తమ మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లినా లాభం లేకపోవచ్చు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని స్పీకర్ లేదా కోర్టు ఎప్పుడైనా వారిని డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి కూటమిలోని పార్టీలే విజయ్ ప్రభుత్వానికి దిక్కు. డీఎంకే పార్టీ కూటమిలో ఏ చిన్న కలకలం సృష్టించినా ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న వీసీకే పార్టీ డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలో భాగస్వామిగా ఉంది. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు.. వీసీకే పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. టీవీకేకు మద్దతు ఇచ్చినంత మాత్రాన తాము డీఎంకే కూటమిని వీడినట్లు కాదని, తమ పొత్తు కొనసాగుతుందని వీసీకే స్పష్టం చేసింది. వీసీకే సాయంతో విజయ్ ప్రభుత్వాన్ని డీఎంకే ఎప్పుడైనా కూల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
వీటి పెంపకంతో ఆదాయం గ్యారెంటీ!