వారెవ్వా.. వరి పొలాలు..
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:04 AM
ఈ వర్షాకాలంలో వరి పొలాలు వారెవ్వా అనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వరి పంటల్లో దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ఈసారి ఎకరాకు 40-50 బస్తాల దిగుబడి
సంతోషం వ్యక్తం చేస్తున్న మండల రైతులు
భీమదేవరపల్లి(వరంగల్): ఈ వర్షాకాలంలో వరి పొలాలు వారెవ్వా అనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వరి పంటల్లో దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం వర్షా కాలంలో వరి పొలాల్లో ఎకరానికి 25-30 బస్తాల దిగుబడి రావడం కష్టంగా ఉండేది. అలాంటిది ఈ సం వత్సరం ఎకరానికి 40-50 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు పొలాలు కోస్తున్నారు. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవలేదు. దీంతో వరి పొలాలకు తెగుళ్లు, చీడపీడలు ఆశించలేదు.
ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో దోమపోటు, నల్లి, పేను తదితర తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గేది. తెగుళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు రైతులు ఎడాపెడా క్రిమిసంహారక మందులు పిచికారి చేసేవారు. దీంతో ఆర్థికంగా నష్టపోయేవారు. ఈ సంవత్సరం వరి పొలాలకు ఎలాంటి తెగుళ్లు ఆశించకపోవడంతో గణనీయంగా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పొలాలు కోసిన రైతులు ఎకరానికి 40-50 బస్తాల దిగుబడి వస్తుందని ఖుషీ అవుతున్నారు.
ఎకరాకు 40 బస్తాల పైనే వస్తుంది..
కొడగండ్ల సుదర్శన్‌రెడ్డి, రైతు, ముల్కనూర్
ఐదెకరాల్లో ఆర్‌ఎన్‌ఆర్ సన్నరకం వరి పంటను సాగు చేశా. పొలాలు ఈని గోలుసు అవుతుంది. ఈసారి పొలాలకు ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించలేదు. ఎకరం పొలానికి 45 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో వరి పొలాన్ని కోస్తాను.
యాసంగి కంటే ఎక్కువ దిగుబడే..
వంగ సంపత్, రైతు, రత్నగిరి
ఈ సంవత్సరం వర్షాకాలంలో వరి పొలాల్లో ఎలాంటి తెగుళ్లు, చీడపీడలు ఆశించలేదు. దీంతో యాసంగిలా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో 25-30 బస్తాల దిగుబడి రావడమే గగనంగా మారింది. ఈ సంవత్సరం వర్షాకాలంలో 40-50 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో పొలాన్ని కోస్తాను.
ఈ వార్తలు కూడా చదవండి:
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News