Share News

మిద్దె పంటలు భళా.. మహానగరంలో పెరుగుతున్న ‘టెర్రస్‌ గార్డెనింగ్‌’

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:40 AM

ఎల్‌నినో పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వీటిని కొనలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మిద్దె పంటలు భళా.. మహానగరంలో పెరుగుతున్న ‘టెర్రస్‌ గార్డెనింగ్‌’
Hyderabad Terrace Gardening

  • మిద్దె పంటలు భళా.. మహానగరంలో పెరుగుతున్న ‘టెర్రస్‌ గార్డెనింగ్‌’

  • శివారు ప్రాంతాలకు సైతం విస్తరించిన కల్చర్‌

  • ఇంటిపైనే సులభంగా టమాట, కొత్తిమీర, పుదీనా సాగు

  • డాబాలే ఆహారభద్రతకు ఆసరా అంటున్న ఉద్యాన అధికారులు

హైదరాబాద్‌ సిటీ: ఎల్‌నినో పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వీటిని కొనలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించేందుకు మిద్దె పంటలే చక్కని పరిష్కారమని ఉద్యాన అధికారులు అంటున్నారు.

దిగుమతులు తగ్గుముఖం..!

నగర వాసులు రోజుకు 45వేల క్వింటాళ్ల వరకు కూరగాయలు అవసరం పడుతుంటాయి. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లకు 40శాతం వెళ్తుంటాయి. అయితే ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో కూరగాయల సాగు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా నగర శివారులోని ప్రాంతాల నుంచి కూరగాయలు తక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో నగరవాసులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే కూరగాయలపై ఆధారపడాల్సి వస్తోంది.


ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా..

నగరంలోని భవనాలపై ఉన్న ఖాళీ ప్రదేశం 40 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో కనీసం సగభాగం మిద్దె పంటలు సాగు చేయవచ్చని ఉద్యానశాఖ అంచనా వేసింది. దీనివల్ల కూరగాయల కోసం ఇతర రాష్ర్టాలపై ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎల్‌నినో లాంటి ఇబ్బందులను సులువుగా అధిగమించవచ్చు. అలాగే ధరల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.


city4.2.jpg62 శాతం మంది మహిళల ఆసక్తి

మిద్దెతోటల సాగుపై నగరంలో 62 శాతం మహిళలు, 28 శాతం మంది యువతీ, యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, మదీనగూడ, చందానగర్‌, గచ్చిబౌలి, మణికొండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌లో టెర్రస్‌ గార్డెనింగ్‌ అధికంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారు ప్రాంతాల వారూ ఈ విధానానికి మొగ్గుచూపడం శుభపరిణామం. సొంత డాబాతోపాటు నీటి సౌకర్యం ఉన్నవారు ఎక్కువగా సాగుచేస్తున్నారు.


పంటలు ఎలా సాగు చేయాలంటే..

ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో డిసెంబరు 15 నుంచి నీటి కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఈ తరుణంలో ఉద్యానశాఖ, వాటర్‌బోర్డు కలిసి కొత్త విధానాన్ని సూచిస్తున్నాయి. నగరంలో వాటర్‌బోర్డు ప్రారంభిస్తున్న గ్రీన్‌ ట్యాంకర్‌ సేవ ద్వారా శుద్ధి చేసిన నీటిని మొక్కలకు వాడుకోవచ్చు. అలాగే డ్రిప్‌ ఇరిగేషన్‌తో 50 శాతం నీరు ఆదా చేయవచ్చని, కుండీలపై కోకోపీట్‌ మల్చింగ్‌ చేస్తే 40 శాతం ఆవిరి తగ్గుతుందని, తద్వారా పంటలు త్వరగా ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య మాత్రమే నీరు పోయాలని, సెల్ఫ్‌ వాటరింగ్‌ బాటిల్‌ పద్ధతిలో రంధ్రాలు చేసిన ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు నింపి మట్టిలో పాతితే మొక్కలకు నెమ్మదిగా నీరు అందుతుందని తెలిపారు.


zz.jpgఎలాంటి పంటలు వేయాలి..

ఎక్కువ నీరు తాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌కు బదులు తక్కువ నీటితో పంట త్వరగా చేతికి వచ్చే టమాట, గోరుచిక్కుడు, చిక్కుడు, బీర, కాకర, దొండ, గోంగూర, పాలకూర, మెంతి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాంటివి వేయాలని అధికారులు చెబుతున్నారు.

15వేల చదరపు గజాల్లో ఇంటిపంట

2019లో కేవలం 30 మంది సభ్యులతో స్ర్టాబెర్రీ గ్రూపుగా మొదలైన ఉద్యమం ప్రస్తుతం ‘సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌’ పేరుతో 70వేల మందికి చేరి దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారింది. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ప్రస్తుతం 15వేల చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలు పండుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

వీకెండ్‌ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు

అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 08:40 AM