రూ.10 పరేషాన్.. మార్కెట్‌లో తగ్గిన చలామణి
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:39 PM
ఒకప్పుడు చేతిలో ముడుచుకుని ఉండే రూ.10 నోటు.. నెమ్మదిగా కనుమరుగవుతోంది.
వినియోగదారులు, వ్యాపారుల ఇబ్బందులు
పెరిగిన డిజిటల్ చెల్లింపులు
చిన్న నోట్ల లభ్యత పెరిగితే సౌకర్యవంతం
జఫర్‌గడ్(వరంగల్): ఒకప్పుడు చేతిలో ముడుచుకుని ఉండే రూ.10 నోటు.. నెమ్మదిగా కనుమరుగవుతోంది. టీ కప్పు, బస్సు టికెట్, చిన్న చిన్న కొనుగోళ్లకు కీలకపాత్ర పోషించేంది. వీటి చలామణి తగ్గిపోవడంతో వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారుల వద్ద ఏదైనా వస్తువు కొనుగోలు చేసినపుడు రూ.100 నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు చాక్లె ట్లు, బిస్కెట్లు, వక్కపొడి వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10 ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు.
పెరిగిన ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపులు..
కరోనా తర్వాత డిజిటల్, ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయి. ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్‌లైన్ చెల్లిం పులకు అలవాటు పడిపోయారు. చిన్నపాటి చెల్లిం పులకు ఫోన్‌పే, గూగుల్ పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులు అనువ తిస్తున్నాయి. దీంతో దుకాణాలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదారులు నోట్లు ఇవ్వడం లేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందు బాటులో లేకుండా పోయింది.
చిన్న మొత్తాల చెల్లింపులో సమస్య...
రూ.10నోట్ల కొరత కారణంగా చిన్న మొత్తాల చెల్లింపుల విషయంలో చిల్లర సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చాలా మంది నగదు బదులు డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. యూపీఐ, క్యూఆర్ కోడ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవల వినియోగం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ఒకపుడు పెద్ద మొత్తాల చెల్లింపులకు మాత్రమే ఉపయోగించిన యూపీఐ ఇపుడు చిన్న మొత్తాలకూ సహజంగా మారింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, మొబైల్ ద్వారా చెల్లించడం.. ఇవి ఇపుడు అలవాటుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో నగదు - డిజిటల్ మధ్య సమతుల్యత అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
చిన్న నోట్ల లభ్యత పెరిగితే..
అయితే గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, వృద్ధులు ఇంకా నగదుపైనే ఆధారపడుతున్నారు. వీరికి రూ.10నోట్ల కొరత ఒక చిన్న అసౌకర్యం మాత్రమే కాకుండా.. రోజువారీ కార్యకలాపాల్లో ఒక అడ్డంకిగా మారుతోంది. అవసరమైన మేరకు చిన్న నోట్లను బ్యాంకులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగవంతంగా, సౌకర్యవం తంగా ఉన్నప్పటికీ.. నగదు చలామణికి కూడా సమాన ప్రాధాన్యం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News