Share News

మండిపోతున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:05 PM

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత 15రోజుల్లో వాటిరేట్లు రెండింతలయ్యాయి. దీంతో పేదలు, మధ్య తరగతి వారు కొనడానికి విలవిల్లాడుతున్నారు.

మండిపోతున్న కూరగాయల ధరలు
Vegetable Prices

మహబూబాబాద్‌: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత 15రోజుల్లో వాటిరేట్లు రెండింతలయ్యాయి. దీంతో పేదలు, మధ్య తరగతి వారు కొనడానికి విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే బియ్యం ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటడంతో పాటు కూరగాయల రేట్లు అధికమవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌తో నేపథ్యంలో దిగుబడులు భారీగా తగ్గాయి. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు రూ.100 తీసుకువెళ్తే చేతి సంచి నిండేది.. ఇప్పుడు రూ.500 తీసుకుపోయిన సంచి నిండక పోగా, వారం గడవక పాయే అని వాపోతున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో కూరగాయల పంటలు గతంలో కంటే తక్కువగా సాగు చేయడం వేసిన పంటలు కూడా చేతికందకుండా ఎండి పోయాయి. ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో వరుస తుపాన్‌లతో పంటలు దెబ్బతిని అక్కడా దిగుబడి దక్కడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, ఇలా అన్నింటి ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


తెలంగాణలో ఎల్‌నినో.. ఏపీలో తుఫాన్‌ ప్రభావంతో..

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే 365 కరువు మండలాలను ప్రకటించగా, మహబూబాబాద్‌ జిల్లాలో ఏడింటిని కరువు మండలాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే! తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి వర్షాలు సరిగా కురవక లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్లలో నీటిమట్టం తగ్గిపోయి పంటలు వేయలేకపోయారు. కాస్తకూస్తో వేసిన పంటలు సైతం ఎండిపోయి చేతికందకుండా పోయాయి. దీంతో రైతులు చేసేదేమి లేక ఆకాశం వైపు ఎదురు చూస్తూ కూర్చున్నప్పటికీ వరుణ దేవుడు కరుణించకపోవడంతో వర్షాలు కురవక పంటలు పూర్తిగా దెబ్బతిన దిగుబడులు తగ్గిపోయాయి.


hnk2.3.jpgఈ క్రమంలో కూరగాయల వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతున్నారు. ఏపీలో సైతం వరుస తుఫాన్‌లతో పంటలు పూర్తిగా దెబ్బతిని కూరగాయల ధరలు ఒక్కసారిగా అమాంతం పెరగడంతో కూరగాయల ధరలు రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. దీంతో మార్కెట్‌కు వచ్చిన వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.


పేదలకు ఇబ్బందులు..

బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఆర్థిక భారం మోస్తుంటే మళ్లీ కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ కూలీ చేసేవారు, చిరు ఉద్యోగులు, సన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందు లు పడుతూ అప్పులు చేస్తున్నారు. ఇంటి అద్దె లు మొదలుకుని అన్నింటి వస్తువుల ధరలు పెరిగి పోవడంతో చాలీచాలనీ వేతనాలతో సతమతమవుతున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో ఇంటిల్లి పాది కష్ట పడితే తప్ప పూటగడవని పరిస్థితి నెలకొంది. గతంలో కూరగాయలకు రోజూరూ.50 వెచ్చిస్తే సరిసోయేదని.. పెరగిన ధరలతో రోజూ ఒక్క కూరగాయలకే రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా నెలకు రూ.3 వేలు కేటాయిస్తున్నారు.


నిత్యావసర సరుకులు, బియ్యం, ఇతరత్రా వస్తువులు ఎలా కొనుగోలు చేసేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడే ఇలా ఉంటే ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు కుటుంబాలు గడిచేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరల పెరుగుదలతో కొనుగోలు స్థోమత లేని పేదలు పచ్చటి మెతుకులతో పూట గడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక అందరికి అన్నం పెట్టే రైతు కూడా పంటలు లేక చేయిచాచే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర పాలకులు చొరవ చూపి నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలను నియంత్రించి అన్ని వర్గాలను ఆదుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.


కొనాలంటే భయమేస్తోంది..

  • గుండగాని భవానీ, గ్రామం ఉప్పరపల్లి, మండలం కేసముద్రం

ప్రస్తుతం పెరిగిన ధరలతో కూరగాయలను కొనుగోలు చేయాలంటే భయ మేస్తోంది. ఏ కూరగాయలు కొనాలన్న కేజీ రూ.50 నుంచి 100 వరకు ధర పలుకుతోంది. నిత్యావసర సరుకుల ధరలు కూడా అందుబాటులో లేకుండా పెరిగాయి, గతంలో రూ.150 నుంచి 200 ఖర్చు చేస్తే వారానికి సరిపడ కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రూ.500తో కూరగాయలు కొనుగోలు చేసినావారం రోజులకు సరిపడ రావడం లేదు. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల భారీ పతనం..

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 12:05 PM