ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:26 AM
టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు సార్లు టైటిల్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ధోని 19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ ప్రస్థానానికి వీడ్కోలు పలకడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు సార్లు టైటిల్స్ అందించాడు. ఈ నేపథ్యంలో ధోని 19 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ ఆటగాడి ప్రస్థానానికి వీడ్కోలు పలకడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ధోని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఆట పట్ల ధోని అత్యంత నిజాయతీపరుడని, 100 శాతం శ్రమించగలనని భావించినప్పుడే మైదానంలోకి దిగుతాడని ప్రశంసించారు. ధోని ప్రదర్శనకు నాటి పాక్ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ సైతం ముగ్దులయ్యారని ఈ సందర్భంగా శుక్లా గుర్తు చేశారు.
రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. జట్టు విజయం అనేది తన వల్ల 99 శాతం సాధ్యమవుతుందని, ఒక్క శాతం మాత్రం తగ్గుతుందని అనిపించినా కూడా వెంటనే తప్పుకునే వ్యక్తిత్వం ధోనిదని పేర్కొన్నారు. ఎంతో ఆలోచించే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని, ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మెంటార్‌గా జట్టుకు ఎంతో మేలు చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులో ధోనికి 'తలా'గా విశేష ఆదరణ ఉన్నప్పటికీ, అంతకుమించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని శుక్లా గుర్తుచేశారు. 2007లో టీమిండియా కెప్టెన్‌గా ధోనిని నియమించినప్పుడు తొలుత అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. సచిన్ సైతం ఆ బాధ్యతను తిరస్కరించిన వేళ ధోని సారథ్యం చేపట్టి తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడని శుక్లా వెల్లడించారు.
క్లిష్టమైన, ప్రతికూల పరిస్థితుల్లోనూ జట్టును విజయతీరాలకు చేర్చడం ధోని ప్రత్యేకతని రాజీవ్ ప్రశంసించారు. అలానే 2006 పాకిస్థాన్ పర్యటన నాటి మధుర జ్ఞాపకాలను ఈ బీసీసీఐ ఉపాధ్యక్షుడు పంచుకున్నారు. ఆ సమయంలో లాహోర్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. ధోని విధ్వంసకర బ్యాటింగ్‌కు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ముగ్ధులయ్యారని తెలిపారు. ఆ సమయంలో జుట్టు కత్తిరించుకోవద్దని ధోనికి పర్వేజ్ ముషారఫ్ సూచించారని శుక్లా వెల్లడించారు. దీని బట్టి అప్పటికే ధోని ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. తన ప్రదర్శనతోనే అసాధారణ ప్రజాదరణ సంపాదించుకున్న ధోని భవిష్యత్తులోనూ క్రికెట్‌కు విలువైన సేవలు అందిస్తాడని శుక్లా ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి:
జడేజాను పక్కనపెట్టడం అన్యాయం.. టీమిండియా నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!
ఫిలిప్స్, హెన్రీ సెంచరీలు... తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 368 ఆలౌట్