జడేజాను పక్కనపెట్టడం అన్యాయం.. టీమిండియా నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:04 AM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కని విషయం తెలిసిందే. దీనిపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కని విషయం అందరికీ తెలిసిందే. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భారతజట్టు యాజమాన్యం జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జడేజాను తుది జట్టులోకి తీసుకోకపోవడపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
91 టెస్టులు ఆడి 4,160 పరుగులు, 356 వికెట్లు తీసిన జడేజా ప్రస్తుత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ప్రస్తుత సైకిల్(2025-27)లో టీమిండియా తరఫున మూడో అత్యధిక పరుగుల వీరుడిగా జడ్డూ ఉన్నాడు. ఈ సైకిల్లో 11 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 60.76 సగటుతో 790 పరుగులు చేశాడు. అందులో 2025లో ఇంగ్లండ్ పర్యటనలో కేవలం ఐదు టెస్టుల్లో 86 సగటుతో 516 పరుగులు సాధించాడు. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడంపై అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ మాట్లాడుతూ.. 'సెలక్టర్లకు సుందర్‌పై నమ్మకం ఉంటే జడేజాతో కలిపి ఇద్దరినీ టాప్-7లో ఆడించాలి. లేదంటే ధ్రువ్ జురెల్‌ను పక్కనపెట్టి వీరిద్దరినీ బ్యాటర్లుగా తీసుకోవాలి. ఒక వేళ సుందర్, జడేజాలలో ఒక్కరినీ ఎంపిక చేయాల్సిన పరిస్థితి వస్తే.. సీనియర్, ప్రతిభ కలిగిన జడేజాకే అవకాశం ఇవ్వాల్సింది. అలాంటి అతడినే తుది జట్టులోకి తీసుకోకపోవడం జడేజాకు ఎలాంటి న్యాయం? అవుతుంది' అని అశ్విన్ ప్రశ్నించాడు.
టీమిండియా సెలక్టర్లు తీసుకునే ఇలాంటి నిర్ణయాలతో సీనియర్లలో నిరాశ పెరుగుతుందని, భవిష్యత్తులో ఆటగాళ్లు.. జట్టు గురించి కాకుండా తమ గురించే ఆలోచించే పరిస్థితి వస్తుందని అశ్విన్ హెచ్చరించాడు. 'రాజస్థాన్ రాయల్స్ తరఫున మంచి కాంట్రాక్ట్ ఉంది కదా, 100 టెస్టులు ఆడి తప్పుకుందాంలే అనే భావన జడేజాకు రావచ్చు. మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పాలనే అదనపు శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది' అని అశ్విన్ పేర్కొన్నాడు. మరోవైపు.. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ వికెట్ తీయలేదు. అలానే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగడపై క్రికెట్ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫిలిప్స్, హెన్రీ సెంచరీలు... తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 368 ఆలౌట్
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్..75 ఏళ్ల రికార్డు బద్దలు!