Share News

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్..75 ఏళ్ల రికార్డు బద్దలు!

ABN , Publish Date - Nov 20 , 2026 | 07:56 AM

జోహాన్స్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్..75 ఏళ్ల రికార్డు బద్దలు!
Temba Bavuma

స్పోర్ట్స్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రోటీస్ డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 16 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా బవుమా చరిత్ర సృష్టించాడు. అంతేకాక 75 ఏళ్లుగా ఉన్న రికార్డును బవుమా బ్రేక్ చేశాడు.


2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన బవుమా.. ఇప్పటివరకు త‌ను సారథ్యం వహించిన 16 టెస్టుల్లో ఏకంగా 14 విజయాలు నమోదు చేశాడు. ఇందులో కేవలం ఒకే ఒక్క ఓటమి, ఒక డ్రా మాత్ర‌మే ఉన్నాయి. అతడి విజయ శాతం 87.5%గా నిలిచింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ లిండ్సే హ్యాసెట్ పేరిట ఉండేది. అతడు 1949 డిసెంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో తన కెప్టెన్సీ కెరీర్‌ను ప్రారంభించాడు. అతడి నాయకత్వంలో ఆస్ట్రేలియా ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. 1950 ఫిబ్రవరిలో అదే వేదికపై ప్రోటీస్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. కెప్టెన్‌గా హ్యాసెట్‌కి తొలి ఓటమి 10వ టెస్టులో ఎదురైంది. ఓవరాల్‌గా కెప్టెన్‌గా అతడి కెరీర్‌లోని మొదటి 16 మ్యాచ్‌లను 13 విజయాలతో ముగించాడు. తాజాగా బవుమా అదే 16 టెస్ట్ మ్యాచుల్లో 14 విజయాలు సాధించి.. హ్యాసెట్ రికార్డును బ్రేక్ చేశాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే... ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మిడిలార్డర్ ‍బ్యాటర్లు తౌహిద్ హ్రిదోయ్(137), లిట్టన్ దాస్‌(120) భారీ శతకాలతో కదం తొక్కారు. అనంత‌రం సౌతాఫ్రికా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 557 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 168 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 12 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది.


తొలి 16 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లు

  • 14 – టెంబా బవుమా

  • 13 – లిండ్సే హస్సెట్

  • 11 – బిల్ వుడ్‌ఫుల్

  • 11 – స్టీవ్ వా

  • 11 – రికీ పాంటింగ్


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ సరసన గ్లెన్ ఫిలిప్స్.. అరుదైన రికార్డు!

ఆ ఇద్దరి పోరాటం..

Updated Date - Nov 20 , 2026 | 08:02 AM