Share News

ఆ ఇద్దరి పోరాటం..

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:16 AM

భారత్‌తో ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుత పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (3/52) ధాటికి విలవిల్లాడిన కివీస్‌ ఓ దశలో....

ఆ ఇద్దరి పోరాటం..

భారత్‌తో తొలి టెస్టు

  • నికోల్స్‌ అజేయ శతకం

  • సెంచరీ ముంగిట ఫిలిప్స్‌

  • కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 243/5

  • బుమ్రాకు మూడు వికెట్లు

వెల్లింగ్టన్‌: భారత్‌తో ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుత పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (3/52) ధాటికి విలవిల్లాడిన కివీస్‌ ఓ దశలో 70/5 స్కోరుతో నిలవగా.. 150 పరుగులు కూడా కష్టమే అని అంతా భావించారు. కానీ వన్‌డౌన్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్‌ (221 బంతుల్లో 14 ఫోర్లతో 113 బ్యాటింగ్‌) అజేయ శతకంతో అండగా నిలిచాడు. అతడికి మరో ఎండ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (182 బంతుల్లో 13 ఫోర్లతో 94 బ్యాటింగ్‌) సహకారం అందించాడు. ఫలితంగా గణనీయంగా కోలుకున్న కివీస్‌ తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 243/5 స్కోరు సాధించింది. అన్షుల్‌, ఆకాశ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

తొలి సెషన్‌లోనే జోరు..: టాస్‌ గెలిచిన భారత్‌ ప్రత్యర్థి కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. తమ కెప్టెన్‌ నిర్ణయాన్ని పేసర్లు అద్భుతంగా వినియోగించుకున్నారు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే కెప్టెన్‌ లాథమ్‌ (0)ను కళ్లుచెదిరే రీతిలో బుమ్రా బౌల్డ్‌ చేయగా, నాలుగో ఓవర్‌లో కాన్వే (4)ను అన్షుల్‌ అవుట్‌ చేశాడు. అయితే తొలి ఓవర్‌లోనే బరిలోకి దిగిన నికోల్స్‌-రచిన్‌ (15) జోడీ కాస్త ఓపికను చూపింది. 95 బంతుల్లో 35 పరుగులు జోడించాక రచిన్‌ను పేసర్‌ ఆకాశ్‌ వెనక్కి పంపాడు. అయితే ఎక్స్‌ట్రా బౌన్స్‌ బంతులను ఆడేందుకు ముందుకు వస్తున్న డారిల్‌ మిచెల్‌ (1)ను దెబ్బ తీసేందుకు భారత్‌ షార్ట్‌ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి ఫలితం సాధించింది. బుమ్రా ఓవర్‌లో జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి తను వెనుదిరిగాడు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి కివీస్‌ 60/4తో కష్టాల్లో పడింది.


నికోల్స్‌-ఫిలిప్స్‌ హవా: రెండో సెషన్‌ ఆరంభంలోనే బ్లండెల్‌ (5)ను కూడా బుమ్రా అవుట్‌ చేశాడు. అప్పటికి కివీస్‌ 70/5 స్కోరుతో ఉండగా భారత శిబిరంలో ఫుల్‌ జోష్‌ కనిపించింది. కానీ నికోల్స్‌తో ఫిలిప్స్‌ జత కట్టాక సీన్‌ మారింది. రెండున్నర సెషన్లపాటు ఈ జోడీని విడదీయలేక భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆరో వికెట్‌కు వీరు అజేయంగా 173 పరుగులు జోడించడం విశేషం. ఫిలిప్స్‌ ఆరంభంలోనే బౌండరీలు సాధించి నికోల్స్‌పై ఒత్తిడి తగ్గించాడు. అటు తొలి సెషన్‌లో పిచ్‌పై కనిపించిన మూమెంట్‌ లేకపోవడంతో బ్యాటర్లకు తేలికైంది. దీనికి తోడు 30 ఓవర్‌ నుంచి కూకాబుర్రా బంతి మెరుపును కోల్పోవడంతో బ్యాటర్లు ఇబ్బందిపడలేదు. కివీస్‌ ఈ సెషన్‌లో 80 పరుగులు చేసి వికెట్‌ మాత్రమే కోల్పోయింది. ఇక చివరి సెషన్‌లో అంతా నికోల్స్‌-ఫిలిప్స్‌ ఆధిపత్యమే సాగింది. అన్షుల్‌, ప్రసిద్ధ్‌ పూర్తిగా తేలిపోయారు. ఈ దశలో బుమ్రా మాత్రమే సమర్థవంతంగా బౌలింగ్‌ చేయగలిగాడు. నికోల్స్‌ కూడా అతడి బంతులను ఆడలేకపోయినా వికెట్‌ మాత్రం ఇవ్వలేదు. హెన్రీని దెబ్బతీసేందుకు లెగ్‌ సైడ్‌ ఆరుగురు ఫీల్డర్లను మోహరించినా ఫలితం లేకపోయింది. ఓపిగ్గా ఆడిన నికోల్స్‌ 188 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఇక కాసేపటికే ప్రసిద్ధ్‌ ఓవర్‌లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను పంత్‌తో సమన్వయలోపం కారణంగా దేవ్‌దత్‌ వదిలేయడం జట్టును షాక్‌కు గురి చేసింది. అనంతరం మరో 8 ఓవర్లపాటు కివీస్‌ వికెట్‌ కోల్పోకుండా ఆడి తొలి రోజును ముగించింది. ఫిలిప్స్‌ శతకానికి మరో ఆరు పరుగుల దూరంలోనే ఉన్నాడు.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) బుమ్రా 0, కాన్వే (సి) పంత్‌ (బి) అన్షుల్‌ 4, నికోల్స్‌ (బ్యాటింగ్‌) 113, రచిన్‌ (సి) పంత్‌ (బి) ఆకాశ్‌ 15, మిచెల్‌ (సి) జైస్వాల్‌ (బి) బుమ్రా 1, బ్లండెల్‌ (సి) గిల్‌ (బి) బుమ్రా 5, ఫిలిప్స్‌ (బ్యాటింగ్‌) 94; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 82 ఓవర్లలో 243/5; వికెట్లపతనం: 1-2, 2-12, 3-51, 4-52, 5-70. బౌలింగ్‌: బుమ్రా 17-5-52-3, అన్షుల్‌ 18-4-57-1, ఆకాశ్‌ 15-5-33-1, ప్రసిద్ధ్‌ 16-2-58-0, సుందర్‌ 16-2-38-0.

1

బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో ఎక్కువ శతకాలు (5) బాదిన బ్యాటర్‌గా మార్టిన్‌ క్రో, విలియమ్సన్‌ సరసన నిలిచిన నికోల్స్‌.

10

టీమిండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు (237) తీసిన పదో బౌలర్‌గా బుమ్రా. ఈక్రమంలో శ్రీనాథ్‌ (236)ను అధిగమించగా, కుంబ్లే (619) టాప్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 05:16 AM