టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..
ABN , Publish Date - Nov 19 , 2026 | 10:33 AM
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతిల కుమార్తె సైరా యూఏఈలో జరిగిన టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ విజేతగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతిల కుమార్తె సైరా యూఏఈలో జరిగిన టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని లారా సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. తన కూతురితో కలిసి టోర్నీకి వెళ్లి.. విజేతగా తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ లారా మురిసిపోయారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సైరాకు సంబంధించిన ఫొటోలను లారా షేర్ చేసింది. ‘నా కంటే ఎత్తుగా ఎదిగిన నా చిన్నారితో కలిసి టోర్నీకి వెళ్లాను. విజేతగా తిరిగి వచ్చాం. ఎంతో గర్వంగా ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫుజైరాలోని టెన్నిస్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగిన పోటీలో సైరా విజయం సాధించింది. ఈ సందర్భంగా ట్రోఫీ, ప్రైజ్‌మనీ చెక్కుతో అధికారులతో కలిసి దిగిన ఫొటోలను లారా పంచుకున్నారు.
సైరా సాధించిన ఈ విజయం వెనుక ఆమె కుటుంబానికి టెన్నిస్‌తో ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. సైరా తండ్రి మహేశ్ భూపతి భారత టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు. ఆయన కెరీర్‌లో పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి 12 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన రికా హిరాకితో కలిసి గెలుచుకుని గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అనంతరం లియాండర్ పేస్‌తో కలిసి డబుల్స్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. వీరిద్దరి జోడీ ప్రపంచ టెన్నిస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే, లారా దత్తా ఇటీవలే వచ్చిన ‘రామాయణ’ సినిమాలో కైకేయి పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి:
వెల్ ప్లెయిడ్ ఎంఎస్.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ స్పెషల్ పోస్ట్!
తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4