Share News

రోహిత్ శర్మ సరసన గ్లెన్ ఫిలిప్స్.. అరుదైన రికార్డు!

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:50 AM

వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ చేయడంతో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్ శర్మ సరసన గ్లెన్ ఫిలిప్స్.. అరుదైన రికార్డు!
Glenn Phillips

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు అద్భుత శతకం బాదిన అతడు.. ఒకే క్యాలెండర్ ఏడాదిలో టీమిండియాపై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి కివీస్ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ప్లేయర్ కావడం విశేషం.


ఫిలిప్స్ ఈ ఏడాది జనవరి 18న ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో 106 పరుగులు చేశాడు. అనంతరం అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో కేవలం 49 బంతుల్లోనే 107 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. తాజాగా వెల్లింగ్టన్ టెస్టులో 118 పరుగులు చేసి తన అరుదైన ఘనతను పూర్తి చేసుకున్నాడు. కాగా, రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై ఈ అరుదైన ఘనత సాధించాడు. ఆ ఏడాది వన్డేల్లో 124, 104, 208 పరుగులతో పాటు టెస్టుల్లో 102, టీ20ల్లో 118 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టుపై ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో శతకాలు సాధించిన తొలి ప్లేయర్ గా రోహిత్, రెండో ఆటగాడిగా ఫిలిప్స్ నిలిచారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే... టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. హెన్రీ నికోల్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 216 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు హెన్రీ నికోల్స్ కూడా శతకం(153*)తో జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆటలో 115 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 06:52 AM